పుట:Kasiyatracharitr020670mbp.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుట్టున్ను చిన్న తిప్పలున్నవి. కొండలు మెండు. అనేక తిప్పలు కొనల యందు మశీదులు కట్టబడి యున్నవి. హిందూ దేవాలయాలు లేవు. అవి యున్నా వృద్ధికి రానియ్యరు.

షహరుకున్ను ఇంగిలీషుదండుకున్ను 2 కోసుల దూరమున్నది. నడమ హుశేనుసాగర మనే పేరుగల యొక చెరువున్నది. ఆకట్టమీద యింగిలీషువారు గుర్రపుబండ్లు పొయ్యేటందుకు యోగ్యముగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలున్నూ మనుష్యులున్ను ఎక్కినడచి చెరచకుండా భాటకు ఇరు పక్కల తమ పారా పెట్టియున్నారు. జాతులవాండ్లను తప్ప ఇతరులను ఆ కట్టామీద హుకుములేక ఎక్కనియ్యరు. ఈ జాతులవారిని సరంగీలని ఏలచెప్పుచున్నారంటే ఫిరంగీలతొ సహవాసము చేసేవారు గనుక ఫిరంగీవారని ఆభాసముగా అనబడుచున్నది. కుంఫిణీ లష్కరు ఉండే స్థలము హయిదరాబాదుకంటే నానాటికీ ఎక్కువగా బస్తీఅవుచున్నది. 20 సంవత్సరముల క్రిందట నేను చూచినదాని కంటే మిక్కిలి బస్తి అయియుండుటను చూడగా ఆశ్చర్యముగా నున్నది. షహరులో వస్తువులకు సుంకకులేదు. ఏవ్స్తువు మీద సుంకానికి ఎవడు ఊహించి దర ఖాస్తుచేసినా దినాంజీ ఆ సుంకము గుత్తకు ఇచ్చుచున్నాడు. కట్టెల బండ్లకు, విస్తరాకులకున్ను, షహరులో రావడానికి నాలుగయిదు తీరువలు తీరువ తీనేవాని జోరావరి కొద్దిన్ని ఇవ్వవలసి యున్నది. చంపినా అడిగేదిక్కులేదు. యింగిలీషు దండులో ఈ తొందరలు లేకుండా న్యాయవిచారణ కూడా కొత్తవాల్ చావడిలో కమ్మిస్సేరైయాటు అసిస్టాంటు గుండాజరుగుచున్నది. గనుక లోకులున్ను వర్తకులున్ను ఆదండులో వసించడానికి మిక్కిలి ఇచ్చయింపు చున్నారు. అక్కడి యిండ్లకంతా ఎన్నిమిద్దెలు అంతస్తులుగా కట్టినా స్తంభాల మీద పయి పూరి మోపుచేసి మట్టి గోడలుపెట్టి, ఆ గోడల పయిన నాజూకుగా సన్నగారచేసి కావలసినట్టు చిత్రములతో పూయుచున్నారు. అక్కడి గులక కలిసిన యెర్రరేగడ మిక్కిలి గట్టిగా నుంచున్నది.