పుట:Kasiyatracharitr020670mbp.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మున్ను సందులకు సందియున్ను యితర దక్షిణదేశపు షహరులలావాసముచేసే వారికి ఇష్టముగా నుండవు. రాజవీధులలో ఏనుగులు మొదలయిన వాహనాలు యెల్లప్పుడు సంచరింపు చున్నవి గనుక నున్ను మనుష్యులందరున్ను, ఆయుధపాణులై మెత్తని వారిని కొట్టి నరుకుచున్నారు గనుక నున్ను, షహరులో ఇతర దేశస్థులు సవారీమీద పోయి రావలసియుంటే ఆయుధపాణులైన వాక్పారుష్యము కలవారిని కొందరిని కూడా పిలుచుకొని పోవలసి యున్నది. కృష్ణానది దాటినది మొదలు హైదరాబాదు వరకు ఫకీరులు నిండియున్నారు గనుక సవారీమీద నెవరు వచ్చినా అడుగడుగునా ఫకీరులు భిక్షం అడగక మానరు. వారికి కొన్ని గవ్వలయినా యిచ్చి పోకపోతే అవమానము తోచుచున్నది. చెన్నపట్టనపు రూపాయి 1 కి అక్కడి పయిసాలు 50 పయిసా 1 కి 20 పుంజీగవ్వలు. పుంజీ 1 కి గవ్వలు 4. యీ హయిదరాబాదులో పిచ్చిరూపాయిలని యొక దినున్ను గోవింద బఖ్షీలని యొక దినుసున్ను చెలామణి యవుచున్నవి. ఆ రూపాయలు ఒకచేతి నుంచి యొక చేతికి వచ్చేటప్పుడు యొకటి రెండు పయిసాలు నట్టమియ్యకనే చెలామణీ కానేరదు. చెలామణీ రూపాయలకు అక్కడివారు చేసే పరీక్ష అసదృశ మయినది. ఎట్టి రూపాయిలకయినా ఒక దోషము పెట్టకమానరు. చన్నపట్టణపు కుంఫిణీ రూపాయలకు ఆ తొందరలేదు. అయితే అవి దొరకవు. మరి అక్కడి రూపాయలకు రూపాయి 1 కి పయిసాలు 20.

ఈషహరు గోడకు చేరినట్టుగా 'ముసి ' అని అక్కడి వారిచేత చెప్పబడుచున్న ముచుకుంద నది పారుచున్నది. ఆ నది వాడపల్లెవద్ద కృష్ణలో కలియుచున్నది. అది గొప్పనది. పోయినసంవత్సరం నదీప్రవాహము ఎక్కువగావచ్చి డిల్లీ ధరవాజవద్ద యింగిలీషువారు కట్టిన వారిధిని పగలకొట్టి ఆ షహరులో కొన్నివీధులున్ను, బేగంబజారులో కొన్నివీధులున్ను ముంచివేసి పోయినది. బేగంబజారుకున్నూ, షహరుకున్నూనడమ ఆ నది దాటుటకు పూర్వకాలమందు తురకలు మంచిరాళ్ళతో అతి బలముగా నొక్క వారధి యేనుగలు మొదలయినవి గుంపుగా నెక్కి పోవడానకు యోగ్యముగా కట్టినారు. ఆ షహరు