పుట:Kasiyatracharitr020670mbp.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థావరదశను పొందించేటందుకు ఈ పర్వతసమూహములను సృస్టించినట్టు తోచబడుచున్నది. పరమాత్ముని యొక్కలీలావిభూతియయిన యీవిచిత్ర పర్వత సమూహములున్ను నానావిధములయిన వృక్షాలున్ను కలిగిన అరణ్య సమూహాలు చూడగా బుద్ధి ఆశ్చర్య పడడానికి చాలియున్నది గాని ధృడమయిన భక్తిని పొందచాలక నున్నది. ఆపగలు అక్కడ నిలచినాను. ఆయూరు బస్తీయయినది. సంపన్నులయిన కోమటివసతి గదులున్నాయి. దేవస్థలమున్నది. అందులో దిగవచ్చును. రమణియ్యమైన కొలను వున్నది. అదిచుట్టు మంటపాలతో నేర్పరచ బడియున్నది. సకల విధవస్తువులు దొరుకును. ఆయూరున్ను ఇంకా36 గ్రామాలున్ను రాజగోపాలరావు అనే ఆరువేల నియోగి బ్రాంహ్మణునికి కొన్నితరాలుగా జమీను నడుచుచున్నది. 3 లక్షల రూయాయీలు గోలకొండ నవాబుకు కట్టుచున్నారు. ఇప్పుడు12 సంవత్సరముల చిన్నవాడు తల్లికి సహాయముగా దొరతనము చేయుచున్నాడు. ధర్మ సంస్థాన మని చెప్పబడుచున్నది. రాచూరు అనేయూరు వారికి రాజధానిగా నున్నది.

21 తేది ఉదయమయిన 5 ఘంటలకు లేచి 3 కోసుల దూరములోనుండే నాగనపల్లె, బాలనగర మని రెండుపేళ్ళుకలిగిన యూరు10 ఘంటలకు చేరినాను. దారిమిక్కిలి సరాళము. గులక అయిసక కలిగిన రేగడభూమి. నడవ డానికి బండ్లకు మిక్కిలి సయిపుగా నున్నది. ఆయూరికి చుట్టున్ను కోట యున్నది. అది బాలచందు అనేముసద్దికి జాగీరుగానివ్వబడినది. అతడు బహుధర్మాత్ముడని పేరుబడి యశ:కాయముతో ఇప్పటికి జీవింపు చున్నాడు. అతనికి మొగసంతులేదు. అల్లునికి జాగీరు నదుచుచున్నది. ఆకోటనున్ను, గ్రామమునున్ను బహుబస్తీచేసియున్నాడు గనుక ఇదివరకు చూచిన యనేకములయిన కోటలలో ఈకోట గచ్చుచేసి చూపుకు బాగా ఉన్నది. బహుబస్తీ గ్రామము ఆ గ్రామములో నుండే యొక ఆడమనిషి అక్కడ ధర్మ శాలయని వాడుకొనే యొక సత్రము కట్టియున్నది. తిరుపతి వదిలిన వెనుక సత్రమనే మాట యిక్కడ విన్నాను. బాలచందు 2 దేవాలయములు హరి