పుట:Kasiyatracharitr020670mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రున్నది. అది పేటస్థలము, దిగేమజిలి, వసతియయిన గ్రామము. ఆ నివృత్తిసంగమములో నుండే అగ్రహారీకులకు భళ్ళారి జిల్లా శిరిస్తా చేసి యిప్పట్లో బోర్డు సిరస్తాగానుండే రామచంద్రరాయుడు ఒకకాలమందు అక్కడికి యాత్ర బోయి వాక్సహాయముచేసి ఆ యగ్రహారీకులు నవాబు సరకారుకు కట్ట్టుచునుండే పన్నురూకలను మాపుచేయించినారు. అనుభవించే భూమిని సర్వదుంబాలా చేశినాడు. గనుక అక్కడి ద్విజులు మేము చేసే సత్కర్మ ఫలము అతనికి చెందవలసిన దని చెప్పి కొనియాడుచున్నారు. కడప మొదలుకొని యిదివరకు జ్యేష్టమాసము మొదలు శ్రావణమాస పర్యంతము క్రమమయిన వర్షాకాలము. ప్రతి దినమున్ను మబ్బు, వర్షము కలిగియున్నది. కొండకింది గ్రామాదులలో గాలి కొట్టేటప్పుడు ఆ గాలి కొండలమీద మోది అతి ధ్వనితో బహువేగముగా సమీపమందు విసురుచున్నది. కొత్తవారికి ఆగాలి సహించడము ప్రయాసగా నుంచున్నది. తిరుపతి మొదలు కొని యెంత పాతబియ మని అంగటివాడు ఇచ్చినను కొత్తబియ్యము వలెనే అన్నము మెత్తపడుచున్నది; గనుక ఆ బియ్యము వాడికె బడేదాకా ప్రయాసగా నుండును. నాటు ఉప్పుడుబియ్యము ఆ ప్రాంతములలో బొత్తిగా దొరకదు. పేదలు జొన్నలతోనున్ను, అరికె యన్నముతోనున్ను కాలము గడుపుచున్నారు.

21 తేది మొదలు 24 తేది మధ్యాహ్నపర్యంతము తీర్ధ విధి మొదలయిన పితృక్రమములు చేయడానికు అక్కడ వుండి 12 ఘంటలకు భోజనము చేసుకొని బయలుదేరి 2 కోసెడు దూరములో నుండే సిద్ధేశ్వరం ఘాటుకు పోయినాను. ఆ 2 కోసున్ను కొండమీద నెక్కి నడిచి కొండ తిరిగి పోవలసినది. దారి రాతిగొట్టు ఎక్కి దిగుచు నడవలసినది. అక్కడ కందనూరు వారిది యొక పుట్టి యున్నది. నలుగురు బోయిజాతి మనుష్యులు ఆ పుట్టిని తెడ్లతో తోసిగడుపు చున్నారు. ఆ పుట్టి - అనగా పెద్ద వెదురుగంప; 20 మంది కూర్చుండవచ్చును. పయిన చర్మముతో కవచము కుట్టియున్నది. బహుసున్నితము. రవంత ద్వారము పడితే ప్రమ్మదము వచ్చును. ఒక్ పల్లకీనిన్ని 12