పుట:Kasiyatracharitr020670mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరామజయము.

శ్రీ ఏనుగుల వీరాస్వామయ్యగారి

కాశీయాత్రచరిత్ర

మొదటి ప్రకరణము.

జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింప దలచి నన్ను నేలుచున్న సూప్రీంకోరటు [1] దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని 1830 సంవత్సరము మే నెల 18 వ తేది కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము జేరినాను. అది తండయారువీడులోనుండే నాతోటకు 3 గడియల దూరము, కీనీరుభూమి, మధురమయిన జలసమృద్ధి గలది. ద్రావిడ వైష్ణవుల నివాసము. వారు సమిదెలు వగయిరాలు చెన్నపట్టణములో అమ్మి జీవింపుచున్నారు. దోవలో ఉప్పుకయ్యయున్నది. అందులో కాక్రయన్ దొర పడవలు నడిచే పాటికాలువ తొవ్వించి వారధులు కట్టించి యున్నాడు.

19 తేది ఉదయాన అక్కడనుండి పాలవాయి సత్రము మీదుగా వెంకటేశ నాయడి సత్రము చేరినాను. అది శిథిలమై యున్నది. తటాకమున్నది. అంగళ్ళు గలవు. అది మాధవరమునకు 5 గడియల దూరము. దోవనరాళము. బండ్లు నడుచును. ఆ రాత్రి పెద్దపాళెము చేరినాను. దోవలో కొరతలేరు దాటవలెను. దగ్గిర దగ్గిర గ్రామాలున్నవి. బాట నరాళము. ఆ పాళెములో శక్తిరూపములో పరమాత్ముడు తామస పూజల నంగీకరించి లోకుల కిష్టసిద్ధిని జేయుచున్నాడు. ఆ శక్తి చిన్న లింగము జూడగా భూమిలో నుద్భవించి యున్నది. ఆ గుడి బహుచిన్నది. శూద్రపూజ. ఆ పాళెము అరణ్య నదీ తీరము. వాసయోగ్యము. బ్రాహ్మణాగ్రహారము, శివాలయము, పలపట్రల యిండ్లున్నున్నవి. ఈ పాళెము, పై సత్రానికి ఆమడదూరము.

  1. సుప్రీంకోర్టు చెన్నపట్టణమున క్రీ.శ. 1800 మొదలు 1862 వరకు అనగా మద్రాసు హైకోర్టు స్థాపింపబడువరకు నుండిన ఉన్నత న్యాయస్థానము. దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సహాయ న్యాయమూర్తులు నుండేవారు.