పుట:Kasiyatracharitr020670mbp.pdf/431

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అసలు గ్రంథం - వ్రాతప్రతి - మచ్చుపుటలు

చెన్నపట్టణం గవర్నమెంటు ఓరియంటల్ మన్యూస్క్రిట్సు లైబ్రరీలో వున్న నెం.1407 కు కాశీయాత్రచరిత్ర వ్రాతప్రతి. 1832 లో బందరు జిల్లాజడ్జిగా వుండిన సె.పి. బ్రౌను దొరగారికి, ఈ గ్రంధకర్త వీరాస్వామయ్య గారు వ్రాయించి పంపిన అసలు పుస్తకమే.

ఇది 12 1/2 అంగుళముల నిలువు 8 3/4 అంగుళముల వెడల్పు గల అరఠావులకు రెండు పక్కలా పుటకు 31 పంక్తుల చొప్పున మంచి దస్తూరీతో తప్పులు లేకుండా వ్రాయబడిన 490 పుటల గ్రంధం శైధిల్యము, గ్రంధపాఠములులేవు. సమగ్రమైనది.

సంక్షిప్త పరచబదిన ఇంకొక ప్రతి తమవద్ద నున్నదనిన్నీ 1838 లో అచ్చు పడిన గ్రంధం ఇంకా సంక్షిప్తమైన దనిన్నీ ఇదే అన్నింటికంటే మేలైన ప్రతి అనిన్నీ బ్రౌను గారు దీనిపైన 1839 లో రెమార్కు వ్రాసి యున్నారు.

ఈ అసలు గ్రంధానికీ అచ్చుపుస్తకానికీ భాషలోకూడా తేడాలు కనబడుతూ వున్నవి. అసలు గ్రంధంయొక్క రచన ఎలావుంటుందో తెలియగలందులకు మచ్చుకు కొన్ని భాగాలను ఇక్కడ వుదాహరిస్తున్నాను.

వీరాస్వామయ్యగారు దినచర్యగాను, తమ మిత్రుడైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారికి జాబులు గాను వ్రాసిన కాశీయాత్ర చరిత్ర గ్రంధరూపంగా ఎలా కూర్చబదిందీ, దానిని అచ్చువేయడంలో ఆ గ్రంధాన్ని ఎలా తగ్గించినదీ, ఎలాగ మార్చినదీ కూడా ఈ వ్రాతప్రతివల్ల తెలుస్తుంది. 'వుప్పుకాలువకు వారధి కట్టి వుంన్నది, దాటి రావాలశ్నిది; దొవలో కొరతలేరు దాటవలశింది,' అనే మొదలైన సూచనలు వీరాస్వామయ్యగారు అసలు జాబులలో మిత్రునికి వ్రాసే వాడుక భాషగానే వున్నది. ఇప్పటికీ వాడుక భాషకూ ఆ కాలంనాటి భాషకూ గల తేడాలు కూడా దీనివల్ల తెలుస్తాయి. ముఖ్యంగా వర్ణక్రమంలోని విశేషాలు గమనించతగివని. ఉ; భ్రాంహ్మణులు, చంన్నపట్నము, వుంన్నవి, లింగ్గము, తండ్డయారు వేడు, బండ్డి, మొదలైనవి. కొ, కో, గొ, గో, దొ, దో మొదలైన అక్షరాలకు ఏత్వమిచ్చి కొమ్ము, కొమ్ముకు దీర్ఘము ఇచ్చి ఒకారముగా వ్రాసే పద్దతి, ఇప్పుడు అచ్చూక్షరాలలో దొరకడంలేదు. ఇంకా చాలా వెశేషాలున్నవి చూడండి.

ఈవ్రాతప్రతిలోని భాగములు వ్రాసుకొనుట కనుజ్ఞ నిచ్చిన ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారాధికారులకు కృతజ్ఞడను.

భెజవాడ, 20-9-41 ----దిగవల్లి వేంకటశివరావు.