పుట:Kasiyatracharitr020670mbp.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర - అనుమంధము

13 అంశలు (డిగ్రీలు) నడుస్తాడు, సూర్యుడు ఒక అమ్శ మాత్రమే నడుస్తాడు. అందువల్ల వీరిద్దరికీ 59 ఘడియల 4 విగడియలలో, (23 1/2 గంటలలో) 12 అంశల అంతరం కలుగుతుంది. ఈఅంశం వల్లనే ఒక తిధి ఏర్పడుతుంది. ఇలాంటి 30 తిధుల కొక చాంద్రమాసం అవుతుంది. అయితే చాంద్రమాన సంవత్సరంలో తిధులు 360 వున్నా రోజులు 354 మాత్రమే గనక తిధులు వృద్ధిక్షయం చెంది 6 రోజులు తగ్గుతాయి. సూర్యచంద్ర్రుల నడకలలో తేడాలవల్ల ఒక తిధివ్యాప్తి ఒకప్పుడు 65 గడియలు ఇంకొకప్పుడు 53 గడియలూ వుంటుంది. ఇలాగ మొత్తం మీద చాంద్రమాన సంవత్సరంలో 13 క్షయ తిధులూ 7 వృద్ధి తిధులూ వుంటాయి.

ఇంక నక్షత్రాల సంగతికూడా ఇంతే. మొత్తం మీద చంద్రుడు రోజుకో నక్షత్రంలో వుంటాడుగనుక నక్షత్రమాసంలో 27 రోజులు పైచిల్లర వుంటాయి. తిధులలాగనే కొన్ని నక్షత్రాల వ్యాప్తి వృద్ధీ కొన్నింటిని క్షయమూ చెందుతుంది.

వారానికి 7 రోజులే వుంటాయి గాని పక్షంలో మాత్రం ఒక్కొకప్పుడు 13 రోజులు, ఒక్కొక్కప్పుడు 14 రోజులు, 16 రోజులుకూడా వుంటాయి.

పైన చెప్పినట్లు చాంద్రమానాన్ని సౌరమానంతో సరిపుచ్చడంలో రమారమి మూడు సంవత్సరాల కొకమాటు చాంద్రమాన సంవత్సరంలో 13 నెలలు ఏర్పరచ వలసి వస్తూ వుంటుంది. దానికే అధిక మాసమంటారు. ఏమాసం అధికమాసంగా నిర్ణయించడం అనే విషయంలో కూడా సంక్రాంతినే లక్ష్యంగా తీసుకుంటారు. సూర్య చంద్రుల గమనాలను బట్టి చాంద్రమానం చిన్నదిన్నీ సౌరమానం పెద్దదిన్నీఅ అయినప్పుడు ఆ చాంద్రమానంలో సంక్రాంతి వుండదు. ఆమాసాన్ని అధికమాసంగా నిర్ణయిస్తారు. చాంద్రమాసము పెద్దదిన్నీ సౌరమాసము చిన్నదిన్నీ అయినప్పుడు ఆ చాంద్రమాసంలో సూర్యుడు ఒకరాసి దాటి యింకొక రాసిలోకి పోయి మళ్ళీ దానిని కూడా దాటి మూడవరాసిలోనికి పొతాడు. ఒకేచాంద్రమాసంలో ఇలాగ రెండు సంక్రాంతులు కలగడంవల్ల ఆమాసానికి రెండు పేళ్ళు పెట్టవలసి వస్తుంది. అందుచేత ఆ సంవత్సరంలో ఒక నెలను అణిచివేస్తారు. దనికే క్షయమాసమంటారు. అప్పుడు 11 నెలలే వుండవలసిందేగాని క్షయమాసం వచ్చిన సంవత్సరంలో తప్పకుండా అధికమాసంకూడా వస్తూవుంటుంది గనుక ఆ సంవత్సరంలోకూడా సరిగ్గా 12 నెలలు వుంటాయి. క్షయమాసాలు చాలా అదుదుగావస్తాయి. నూరు సంవత్సరాలలో ఒకటి రెండు క్షయమాసాలు వస్తాయి. శాలివాహన శకము 1744 వ సంవత్సరము (క్రీ.శ. 1822-23) చిత్రభాను నామ సంవత్సరంలో ఆశ్వయిజం అధికమాసంగాను పుష్యమాసం క్షయమాసంగాను వచ్చాయి. మళ్ళీ (1963-64) శోభకృతు సంవత్సరంలో పుష్యము క్షయమాసంగాను ఆశ్వీజము అధికమాసం గాను వస్తాయి. ఎఫ్ఫుడువచ్చినా క్షయమాసం మార్గశీర్ష పౌష మాఘ మాసాలలో నే వస్తాయి. ఎందుచేతంటే ఈ చాంద్రమాసాలకు 29 దినముల వ్యాప్తిగల సౌరమాసములతో సంబంధం వున్నది.*


  • చూడు: ఆంధ్రవిజ్ఞాన సర్వస్వంలో కొమఱ్రాజు లక్షమణరావుపంతులు గారు వ్రాసిన "అధికమాసం" అనే వ్యాసము: లక్ష్మణరాయ వ్యాసావళిలో 'పంచాగము ' అనేవ్యాసము.