పుట:Kasiyatracharitr020670mbp.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీద యీ స్థలమును యింగిలీషువారు స్వాధీనము చేసుకున్నారు. 1742 సంవత్సరములో కలాపన పొసగి జగదీశ్డ్వరుని కటాక్షముచేత ప్రాంసు దండు పరారి అయిపోయినది. అది మొదలుగా అరికాటి నవాబును విహితపరుచుకుని క్షేమముగా కాలము తోయుచుండగా 1767 సంవత్సరమువరకు హయిదరుతో నవాబు నిమిత్తము పోరవలశి వచ్చినది.

అది మొదలు యధాక్రమముగా అరికాటినవాబు రాజ్యమంతా యింగిలీషువారి అధీనమయి వుత్తరము గంజాం మొదలు దక్షిణము తిన్నెవల్లి శీమవరకున్ను తూర్పుసముద్రము మొదలు పశ్చిమసముద్రమువరకున్ను యేకచక్రాధిపత్యముగా యీ చెన్నపట్టణమును రాజధాని చేసుకుని కుంఫిణీవారు యేలుతూ వున్నారు. యీ రాజదానికింద యిప్పుడు వుండే జిల్లాలు యిరువైవొకటి. యింత భూమిమధ్యే మయి సుమారు మళయాళము కొచ్చిల్ యీ దేశముల రాజులుతప్ప కొదవ అందరు జమీందారి పాయకాలవారు గాని యుద్ధసన్నద్ధులు కాగల భూపతులు వొక్కడున్నులేరు.

యీ చెన్నపట్టణము కొడి (జండా) కింద యిప్పుడు సాలుకు సుమారు ఒకటింకాలు కోటివరహాలు వసూలవుతున్నవి. ఖరుచులు అప్పులకు యిచ్చేవడ్డి సహాగా వసూలుకు యెక్కువగాని తక్కువలేదు. యీ చెన్నపట్టణము కొడికింద కుంఫిణీవారి అప్పు సుమారు రెండుకోట్లవరహాలు వుండును. స్థావరజంగమ రూపమైనస్థితి మూడుకోట్ల వరహాలు వుండునని తోచుచున్నది. దండు 40 వేలమంది ఫౌజువున్నది. యీ చెన్నపట్టణపు బస్తీకి మూడుపక్కలా షహరు (పానా) గోడపెట్టివున్నది. తూర్పుపక్క సముద్రమేగాని గోడలేదు. బస్తీకోసెడు దూరములో దక్షిణపక్క యుద్ధసన్నద్ధమయిన కోట సముద్రవారగా కట్టివున్నారు. వుత్తరపక్క సముద్రముగట్టున యెగుమతి దిగుమతులయ్యే రేవు సరుకు వేసేకొట్లున్ను కట్టి వున్నవి. ఈ చెన్నపట్నానికంతా పాపంవీథి శాలవీధి ఈరెండున్ను విశాలమైనవి. నిండా కుసంధి అయిన వీధులుకావు. యిండ్లకు రెండువిధాల పన్ను రూకలు తీసుకుని వీధులుపూడ్చి మరామత్తుచెసి ఠాణాలు