పుట:Kasiyatracharitr020670mbp.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజనము కాఛెసుకుని రెండు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి అమడదూరములో వుండే నెల్లూరు షహరు 6 గంటలకు చేరినాను.

పయి సత్రమువద్ద కొమటియిండ్లులు కొన్ని చేరినవి గనుక కావలసిన సామానులు దొరికినవి. ఆ సత్రానికి ముందు అల్లూరు మొదలుగా నేమి, యివతల నెల్లూరువరకు న్నేమి నాలుగైదు సత్రాలున్నవి. దారి సడక్కు వేశి గులకరాళ్ళు పరచి ఘట్టించి శాల చెట్లు వుంచివున్నారు. అవి పెద్ద చెట్లు అయినవి గనుక నీడ బాగా యిస్తూవున్నవి. నెల్లూరిలో జిల్లాజడ్జి కలకటర్లు వున్నారు.

పినాకినీనది దాటి నెల్లూరు ప్రవేశించినాము. నది అరకోసెడు వెడల్పు కద్దు. వొడ్దున రంగనాయకులపేట యనే గొప్ప విష్ణుస్థలమున్నది. వుత్తరము మూడుకోసుల దూరములో జొన్నవాడ యనే వూరు కామాక్షమ్మదేవీ సహితముగావున్నది. అక్కడ లక్ష్మీసరస్వతులు వింజామరలు వేశే అవసరముగా దేవివద్ద బింబాలను చేసి వున్నారు. బహుమంది సేవించి వరప్రసాదసిద్ధు లవుతారు. ఆ వూరు భోగస్త్రీలకు మిరాశి గనుక వారి సంఘప్రాబల్యముగలది. ఆవూరికి మిక్కిలి సమీపముగానే వొక చిన్న కొండమీద నరసింహస్వామి దేవాలయ మున్నది. యీజిల్లాలోనే వంగోలుకు రెండామడదూరములో శింగరాయకొండ యనే జాగ్రతస్థలము వొకటి వున్నది. నెల్లూరు సౌఖ్య మయిన వూరు. ఆరోగ్యకరమయిన భూమి. సుమారు వెయ్యిండ్లుకలవు. వుద్యోగస్థులచేత నిబిడీకృతముగావున్నది. గాని వర్తకులు లేరు. సమస్త కూరకాయలు పదార్ధాలు మంచి పాలుపెరుగు కావలశినప్పుడు దొరుకును.

చినగంజాం మొదలుగా సముద్రతీరమందు యీ జిల్లాలో వుప్పు పయిరుచేయడము విస్తారము గనుక వుప్పరజాతి స్త్రీలు దోటిముక్కరలు ధరించి పురుషులు సహాగా భూమి తొవ్విపొలాలుయేర్పరచే పనులలో జాగ్రత్తగా వుంటారు. యిప్పట్లో దక్షిణదేశము పడమటిదేశము పొడుగునా భూమి తొవ్వడానకు నెగడివుండేవారు యీ దేశపు వుప్పరవాండ్లున్ను, వోఢ్రదేశపు వొడ్డేవాండ్లుగా తోచినది. నెల్లూరిలో