పుట:Kasiyatracharitr020670mbp.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీనెట్టున బహుప్రసిత్థి కెక్కివున్నవి. వొక దేవాలయముకూడా వున్నది. యీవూళ్ళో యీరాత్రి వసించినాను.

ఇరువది నాలుగవ ప్రకరణము

31 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి రెండామడ దూరములోనుండే శింగవృక్ష మనే వూరు వొక గంటకు చేరినాను. దారి వరిపొలాల గనిమొల మీద నడిచి రావలసినది. రేగడ భూమి అయినందుననున్ను, వర్షాలు కురిశి వున్నందునన్ను చాలా అడుసునీళ్ళు గలిగి బహుప్రయాసగా వుండినది. గోదావరి వుదకము లడ్డకట్టి తెచ్చిన నాలుగు మడుగులు, రొమ్ముల లోతునీళ్ళలో దాటినాము. శింగవృక్ష మనే వూరు గొప్పబస్తీ. 100 బ్రాహ్మణ యిండ్లు కలవు. అనేకముగా అంగళ్ళు కలవు. ఈవూళ్ళో భోజనానకు నిలిచి మూడు గంటలకు మళ్ళీ బయిలువెళ్ళీ 6 గంటలకు బోండాడ ప్రవేశించినాను. దారిలో తెల్లవారివలెనే రెండు మడు;గులు దాటడమయినది.

బోండాడ అనేవూరున్ను బస్తీగ్రామమేను. యీ వూరికున్న ఘట్టిపర అయినందున ధాన్యము పాతరలువేశి వుంచుతారు. రాజమహేంద్రవరము మొదలుగా తాటిచెట్లు అమితముగా కలిగివున్నవి. ప్రతివూరనున్ను తాటిపండ్లరసము తీసి చాపలుగా చేసి వుంచుతారు. యీరాత్రి యిక్కడ వసించినాను.

ఆగష్టునెల 1 తేది వుదయమయిన 4 గంతలకు బయిలువెళ్ళీ యిక్కడికి 4 కోసులదూరములో నుండే యేలూరిపాడు అనేవూరు 10 గంటలకు చేరినాను. యీవూరు పేటస్థలము. నేడు నడిచిన దారి యిసకపర. శింగవృక్ష మనేవూరు మొదలు యిదే రీతిని దారి అనుకూలముగా వున్నది. బండ్లు సమేతముగా రావచ్చును. యీవూరు నియోగుల అగ్రహారము. రాజమహేంద్రవరము జిల్లాకున్ను బందరు జిల్లాకున్ను యీవూరివద్ద వుండే వుప్పుకాలువ సరిహద్దు అని తెలియవలసినది.