పుట:Kasiyatracharitr020670mbp.pdf/382

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తన జమీన్ గ్రామాలమీదుగా తానుకూడా వచ్చి యెనిమిదామడపత్యంతము నన్ను సాగనంపించవలె నని తలచి ప్రార్ధించినాను గనుక దండుల్దారిని యేలూరిమీదుగా నా రెండుబండ్లను రవానాచేసి నేను అడ్డదారినివుండే వాడపల్లి రాత్రి 7 గంటలకు ప్రవేశించినాను. దారి గోదావరి వొడ్డుననే వొక మనిషి నడిచేపాటి కాలిదారిగా వున్నది. రాజమహేంద్రవరమునకు వాడపల్లె అనేవూరు 6 కోసుల దూరము. గోదావరి మధ్యే కొన్ని లంకలు ప్రవాహపు వేగాన పెట్టబడుచువచ్చుచున్నవి. వాడపల్లి యనే వూరు విష్ణుస్థలము గనుక వెంకటేశ్వరుల గుడి చిన్నదిగా వొకటి వున్నది. యిరువై యిండ్ల వైష్ణవాగ్రహారముకూడా కలదు. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారి తమ్ముడు యీ వాడపల్లెలో విశాలమయిన నగరు కట్టివున్నాడు. యీ రాత్రిన్ని మరునాడున్ను యిక్కడ వుండినాను. యీవూరు గోదావరి వొడ్డు గనుక యీవూళ్ళో బావులులేవు.

30 తేది వుదయమయిన ఆరుగంటలకు లేచి యిక్కదికి 7 కోసుల దూరములో వుండే ఆచంటయనే వూరు 11 గంటలకు చేరినాను. దారిలో సప్తగోదావరి యనే వొక పాయ పడవలకుండా దాటడమయినది. యిది కాలి భాట. తొపులు, వూళ్ళమధ్యే నడుస్తూ వచ్చినాము. అందులో రాల (ర్యాలి) యనే వొక గ్రామములో శుభ్రమయిన నల్లశిలతో ప్రభసమేతముగా వొక గోపాలమూర్తిని చేసివున్నది. ఆ ప్రభలోనున్న మూర్తి పీఠము మీదనున్ను రాసక్రీడలు మొదలయిన అవసరాలు మూర్తీభవించి నట్లుచెక్కి ప్రధానమూర్తిని గోళ్ళు, వెండ్రుకలుకూడా విరళపరచి అతిసుందరముగా చేసివున్నది. యీ మూర్తి సముద్రములో కొట్టుకొని వచ్చినట్టు యిక్కడ చెప్పుకొంటారు. ఆచంట అనే వూళ్ళో వెంకటరాయనింగారు తన నివాసముకొరకు వొక గొప్ప నగరుకట్టి దానికి చుట్టూ సుందరమయిన వనము నిర్మించిల్ వున్నాడు. యీ వూళ్ళోనున్ను, వాడపల్లెలోపల వున్నట్టే వొక పోలైసు అమీను వున్నాడు. ముప్పై బ్రాహ్మణ యిండ్లు వున్నవి. యిక్కడ పెండలపు గడ్డలు బహు బాగా అయి