పుట:Kasiyatracharitr020670mbp.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లతో చేరిన పురుహూత యనే శక్తి అదృశ్యముగా వసింపుచున్నదట. ఆపెకు ఉత్సవాలు యేమిన్ని నడవడము లేదు.

యీ వూళ్ళో యిన్నూరు బ్రాహ్మణయిండ్లు కలవు. వారందరు తీర్ధవాసులుగా యాచకవృత్తిని వహించియున్నారు. యీదేశములో గంజాము మొదలుగా భూరూపకమయిన జీవనము లేని బ్రాహ్మణుడు లేడు. యీ దినము తొలిఏకాదశి. దీన్ని సమస్తమయిన వారు యీ ప్రాంతములో గొప్ప పండగగా జరిగింపుచున్నారు. గయాపాద తీర్ధమువొడ్దున నేను డేరాలువేశి దిగి యిక్కడికి గుడిలోపల వంట, భోజనములు కాచేసుకున్నందున గయాతీర్ధములో స్నాననిమిత్తమై వచ్చిన వూరి స్త్రీలను బాలుల సమేతముగా అందరినిన్ని దర్శనము చేయడమయినది.

యీ వూళ్ళో పోలీసుదారోగా సహితముగా జమెందారులు నీలాద్రిరాయనింగారి కుటుంబస్థులు వొక మట్టికోటకట్టుకొని అందులో వసింపుచున్నారు. యీవూరు గొప్పబస్తీ. సమస్తపదార్ధాలు దొరుకును. సురాకార మనే పెట్లప్పు యిక్కడ పైరౌచున్నది. వూరుతోపులతోను తటాకాలతోను నిండి విశాలమైన వీధులు కలిగివున్నది. నేడు తెల్లవారి నదిచిన దారి కొంతమేర అడుసు నీళ్ళుగాని మిగిలిన భాట యిసకపరగానున్నది. జగన్నాధము మొదలుగా యిసకపరభూమి గనుక తాటిచెట్లు, మొగిలిచెట్లు, జెముడు, యివి మొదలయినవి విస్తరించిల్వున్నవి. యిండ్లకు తాటాకులు కప్పి పయిన కసువు పరుస్తారు. యీవూరి బ్రాహ్మణులు విచ్చలవిడిగా తారతమ్యాలు తెలియక నటింఛేవారు. పదిరూపాయలు భూరి పంచిపెట్టినంతలో యధోచితముగా సంతోషించిరి.

యిక్కడనుంచి రెండుగంటలకు బయిలువెళ్ళి నాలుగు కోసులదూరములొనుండే పెద్దాపురము 6 గంటలకు చేరినాను. యీ మధ్యాహ్నము నడిచిన దోవ పల్లపు పారు గనుకనున్ను భూమి రేగడ గనుకనున్ను యీదినము వర్షము కురిశినందుననున్ను అడుసునీళ్ళుగా వుండినందున చాలా జారుచూ వచ్చినది. యీ నడమ యేలా అనే వొక చిన్ననది కాలినడకగా దాటినాము. ఈ నది చిన్నదయినా