పుట:Kasiyatracharitr020670mbp.pdf/377

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చున్నది. అది యెందువల్లనంటే వొకదేశపు పురుషుణ్ని మరివొక దేశపు స్త్రీ చూస్తే ఆ పురుషుడి రూపాలుకారములు బాగా వున్నా హేయముగా చూచి అపహాస్యము కిందికి తెచ్చి అసహ్యబడుచున్నది. స్వదేశస్థుణ్ని చూచినంతలో వొక విధమైన యిష్టము హృదయములో అకస్మాత్తుగా జనించి కలియక ఆపేక్ష కలిగిన వెర్రి వాలుచూపులు కులుకులు అనే దేహకంపము - యిది మొదలయిన చేష్టలు స్త్రీలకు పుట్టి మర్మమైన అవయవములు దాచి మూసే లాంచనలతో తమ అవయవములకు ఆ స్వ దేశపురుషులకు నిరూపిస్తూ వుంటారు. తత్రాసి స్వదేశస్థులలోను స్వకీయులనున్ను, అత్యాసన్నులనున్ను స్త్రీలు చూచిన పక్షమందు పైన వ్రాశిన చేష్టలు దశగుణముగా అధికమవుచున్నది. యీ హేతువులవల్లనే పూర్వీకులు వివాహవిషయమై స్వకియ్యులలో సమీప రక్తస్పర్శ కలస్థలములలోకన్యాదానాలు కన్యాప్రతిగ్రహము నిషేధించి నిర్ణయించినట్టు తోచుచున్నది. ఆ నిశ్చయానుసారముగానే పరస్పరవాంచలున్ను వుదయింపుచున్నవి. గాని యీ వాంఛలున్ను వుదయింపుచున్నవి. గాని యీవాంఛలకు ఆచారాలకారాలవలెనే వాడికె మీద పుట్టే మనసు కారణమేగాని మరివొకకారణము వేరే వున్నట్టు తోచలేదు. యిందుకు శిష్టవాక్యము యింగిలీషువారిలో "యూజ్ రిక్రిసయిల్స్ వుయిత్ ఎవ్వది ధింజ్" అని వున్నది. దీనికి తాత్పర్యము యేమంటే పరిచయము అన్నిటితోనున్ను అనుకూలింపచేయుచున్నది అని అర్ధము. 19 తేది అంతా యీవూళ్ళో నిలిచినాను.

20 తేదివుదయాన నాలుగున్నరగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే పిఠాపురమనే పుణ్యస్థలము యేడు గంటలకు చేరినాను. యీవూరు పూర్వము గయాసుర రాజధానిగా వుండినది. యీ స్థలమును పాదగయ యని అనుచున్నారు. యిక్కడ వొక తటాక మున్నది. దాన్ని పాదగయతీర్ధ మనుచున్నారు. యీ తటాకములో గయాసురుని పాదములు వున్నవని ప్రసీద్ధిగనుక యిక్కడ శ్రాద్ధముచేశి పిండప్రదానము చేయవలసినది. తీర్ధ్యమువొడ్డున వొక చిన్న శివాలయమున్నది. అందులోని లింగముపేరు కుక్కుటేశ్వరుడని అనుచున్నారు. యీవూళ్ళో వొకపాడుకూపములో అష్ఠాదశపీఠము