పుట:Kasiyatracharitr020670mbp.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావడముచేత కొన్నికొన్ని తావులలో పశ్చిమాభిముఖముగా వెళ్ళిమళ్ళీ దక్షిణాభిముఖముగా వచ్చుచున్నది.

యీ శ్రీకాకుళము బలరామక్షేత్రమని ప్రసిద్ధి. యీస్థలమహత్యము స్కాందపురాణాంతర్భూతమయిన కూర్మపురాణములో 30 అధ్యాలలో విస్తరించియున్నదట. యీవూరి వోరగా, లాంగూలనది అనే పేరుకల నది వొకటియున్నది. యీవూళ్ళో వీధులు నడమ ప్రవాహకాలాలలో నదిసంబధమైన వుదకము ప్రవహిస్తూ వుంచున్నది గనుక యిండ్లు పురుషప్రమాణము మిట్టవేశి ఆ మిట్టలమీద కట్టుకున్నారు. నదీతీరమందు కోటీశ్వరుడనే శివస్థల మొకటి పురాణసిద్ధమయినదిగా వున్నది. యీవూళ్ళో బ్రాహ్మణ గుజరాతి వాండ్లు 40 యిండ్లవారు రత్న వ్యాపారసాహుకారు పనులు చేయుచున్నారు. సమస్తమయిన పనివాండ్లు వున్నారు. యీవూళ్ళో 8 తేది పర్యంతము వెనక దిగబడిపోయిన బండ్లను కలుసుకొని వెరే బండ్లు యిక్కడ టీకా చేసేకొరకు నిలిచినాను. బండి 1 కి బురంపూరు నుంచి యిక్కడికి కూలి రూపాయిలు 74, యిక్కడినుంచి విజయనగనానకు బండి 1 కి రూపాయిలు 4 చొప్పున నిష్కర్ష చేసినాను.

9 తేది వుదయమయిన 5 గంటలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములో నుండే వెజ్జపురం 9 గంటలకు చేరినాను. యీ వూళ్ళో నాలుగు బ్రాహ్మణయిండ్లు వున్నవి. అంగళ్ళు కలవు. సమస్త పదార్ధాలు దొరుకును. ఆరునెలలుగా వర్షము లేక నిన్నరాత్రి మంచివర్షము కురిసినది. దారిలో యెక్కడచూచినా మడకలుకట్టిదున్నుతూ వున్నారు. శ్రీకాకుళము నుంచి విజయనగరానకు రెండుమూడు మార్గాలు వున్నవి. అందులో యీ మార్గము సమీపమనిన్ని, వసతి అనిన్ని తెలిసినది. యీవరకు నడిచిన దారి యిసక కలసిన రేగడ. నిండా మిట్టాపల్లాలు లేవు.

విజయనగరపురాజులు సంగీతసాహిత్య ప్రియు లయినందున కొందరు భోగస్త్రీలకు సంగీతరత్నాకరం భరతశాస్త్ర ప్రకారము శిక్ష చేప్పించి తయారు చేయించినారు. వారు కొందరు శ్రీకాకుళము వచ్చి వుండగా చింతా జగన్నాధ పంతులు నిన్నరాత్రి వారి విద్యాప్రకట