పుట:Kasiyatracharitr020670mbp.pdf/366

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యీవూళ్ళో కొరివి రామన్నపంతులు అనే జమీందారుడు నివాసము చేయుచూ వచ్చినాడు. వారియింట్లో దిగినాము. అంగళ్ళు వూళ్ళో లేకపోయినా నాపరివారానకు కావలసిన బియ్యము పప్పు యావత్తు ఆ జమీందారుగారు యిచ్చినారు గనుక రాత్రి సుఖోపాయముగా గడిచినది.

మధ్యాహ్నము దిగినవూరు మొదలుగా నరసన్నపేటవరకు రాత్రిళ్ళు నిద్రలేదని గ్రామస్థులు చెప్పుతూవచ్చినారు. దానికి కారణమేమంటే యిక్కడి జమీందారుడు కొన్ని బందిపోట్లకు ఆధారభూతుడైనందున సరుకోటు (Circuit) విచారణకు పెట్టినారట. ఆ కోర్టువారు పూర్తిఅయిన రుజుకాలేదని అతణ్ని వదిలినారట. యిప్పట్లో నామీద సాక్షి చెప్పినవారి వూళ్ళన్ని కొళ్లపెట్టి తగలపెట్టుతానని పౌరుషము పులికి వున్నాడట. అందునిమిత్తము నిద్రలేక బాధపడుతున్నామని చెప్పినారు. జగన్నాధములోను వొకసంగతి వినడములో యిదేప్రకారము హయిదరాబాదునుంచి ధర్మరూకలు తెచ్చే గుమస్తాలను యీదారిలో చంపినందుకు చచ్చినవాడివద్ద వున్న సామానులు కొన్ని దొంగలవద్ద దొరికిన్ని వారిని సరుకోటువారు వదిలినట్టు పండావాండ్లు చెప్పినారు. విజయనగరపు రాజు కాశిలో యిదే ప్రకారము దొంగలను సొమ్ముతోకూడా పట్టిన్ని సరుకోటువారు వదులుతారు గనుక నేను నిభాయించ లేక రాజ్యము కలకటరు అధీనము చేసి కాశీనివాసము చేస్తానని చెప్పినాడు.

యింగిలీషువారి న్యాయమేమంటే, పదిమంది దొంగలు శిక్షలేక తప్పిపోవడము మంచిది గాని, సందేహముమీద వొకగృహస్థుడు దండనకు లోబడడము యుక్తము కాదని లలితముగా న్యాయవిచారణ చేస్తారు. యీదేశములో చూస్తే వొకదుష్టుణ్ని రక్షిస్తే వెయిమంది శిష్టులను శిక్షించినట్టు అనేమాట ప్రత్యక్షముగా వున్నది. యెట్లానడిస్తే చెడ్డదో యీ ధర్మసూక్ష్మము తెలియడానకు యీశ్వరుడు సమర్ధుడుగాని యీశ్వరజ్యోతి దీప్తిగా ప్రకాశించే ప్రకృతి జనులు శక్తులు కారు.