పుట:Kasiyatracharitr020670mbp.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాటినది మొదలు యీవరకు అగ్రహారమనే మాట వినలేదు. పంచద్రావిడబ్రాహ్మలు వొక సమూహముగా వున్నవూరు వొకటిన్ని లేదు. వోఢ్రదేశములోని మనుష్యులు మూర్ఖులున్నూ హఠవాదులున్ను కృత్రిమముచేత హఠము సాధింఛేవారుగానున్ను నాకుతోచబడ్డది. యీబరంపురపు షహరుతో వోఢ్రదేశస్థుల ప్రచారము నిలిచిపోయినది. యిక్కడ అందరు తెనుగువాండ్లేగాని వోఢ్రదేశస్థులు అతిస్వల్పముగా నున్నారు. యీ బ్రాహ్మలయిండ్లు చిన్నవైనా అందులోనే దిగినాము.

5 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 5 కోసుల దూరములోనుండే పలాశీ యనే వూరు 7 గంటలకుచేరినాను. యూవూరు గొప్పదేను. వొకమఠము కొన్ని బ్రాహ్మణయిండ్లునున్నవి. మఠములో దిగినాను. యీవూళ్ళూన్ని జమీందారులవి. యీ గంజాం జిల్లాలో సరకారుకు 12 లక్షలరూపాయిలు వసూలవుచున్నవి. అందులో జామీందారులవశముగా వుండేభూమి ఆరులక్షలరూపాయలది గాక మలకు రాజీలని కొన్ని ముఠాలు లోకులు చేసి లాలుకు కిస్తీలప్రకారము సరకారు రూకలు కట్టుతూ వుంటారు.

ఈదేశాస్థులకు బహుమందికి అర్ధలోభము చాలాకలిగి సుషుప్తి కాలాలలో యిండ్లమీద పడి మనుష్యుల అర్ధప్రాణాలు హరింఛే బుద్ధులు పుట్టడముచేత మల్లడియనే వింతజ్వరము యీశ్వరుడు వీరి శిక్షనిమిత్తము ఈ దేశాములో పుట్టించి లక్షావధి ప్రజలను యీలోకము వదలపెట్టినట్టు తోచుదున్నది. అయితే అందులో సాధువులుకూడా కొందరు లయించి యుందురే అని శంక తోచితే అందుకు సమాధానము(ఏక: పాపాని కురుతే ఫలం భుంజ్తే మహాజన:) అనే వచనము. యీ వచనానకు దృష్టాంత మేమంటే వొకగురువు, వొక శిష్యుడున్ను సముద్రతీరమందు సంచరింపు చుండగా వొకగొప్పవాడ ముణిగి పోయినది. శిష్యుడుచూచి అనేకవేల జనము వాడతోకూడా ముణిగి పోయినదిగదా యిందుకు కారణమేమన గురువును అడిగినాడు. గురువు ఆవాడలో ఒక పాపిష్ఠుడు వుండబట్టి వారిగతి అట్లా అయినదని చెప్పినాడు. శిష్యుడు యింత అన్యాయము యీశ్వరుడు చేయవచ్చునా?