పుట:Kasiyatracharitr020670mbp.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సదరహీ కృష్ణనగరము దాటి రాగానే నదీయ, నద్య, అనిన్ని నవద్వీప మనిన్ని త్రినామము కలిగిన విద్యద్గ్రా మమువద్ద మక్కుషూదాబాదుకుండా వచ్చేభాగీరధిఅనే పేరుకలిగిన గంగధార కలియుచున్నది గనుక యిక్కడ నద్యామొదలుగా ధారగొప్ప అయి అరకోసువెడల్పున ప్రవహింపుచున్నది. ప్రవాహవులోతున్ను మిక్కిలీగంభీరమై వున్నది.

పయిన వ్రాసిన నదియ్య అనే గ్రామములో కొందరు జమీందార్లవల్ల కొన్ని పాఠశాలలు యేర్పరచబడి అందులో అనేక విద్యార్ధులను పోషించేటట్టు నియమముచేసి వున్నది గనుక గౌడులలోనున్ను, ద్రావిళ్ళలోనున్ను నన్నూటిదాకా సుమారు శాస్త్రపాఠములు చదువుకొంటూ వుంటారు. యిక్కడ శిక్షాధికారులు గౌడా బ్రాహ్మణులుగాని, ద్రావిళ్ళు కారు. వారి పాండిత్యము ప్రసిద్ధికెక్కి వున్నది.

యేప్రల్ నెల 2 తేది శాంతిపూరనిన్ని సంతిపూరనిన్ని ద్వినామము కల విద్యద్గ్రామము చేరినాను. యిదిన్ని గొప్పవూరు. అన్నివిధాల నద్యాకు సరిపోలివున్నా విధ్యార్దులున్ను, శిక్షాధికారులున్ను మిక్కిలిలేరు. యీ శాంతిపూరుకు ముందు కలనా అనే గొప్పగ్రామమున్నది. యీవూరు మొదలుగా టెంకాయతోపులు, పోకచెట్లు నిండా చూస్తూవస్తాను. మనస్వదేశము వదిలిన వెనక యీవరకు యెక్కడా టేంకాయ తోపులు చూచినవాణ్నికాను. టెంకాయచెట్లు, పోకచెట్లు శానా ప్రదేశములలో లేకవుండినా ఆ ఫలములు అయ్యే ప్రదేశాములలో లేని దేశస్థులు తెప్పించుకుని అవశ్యము వాడికెలోకి తెచ్చుకుంటూ వున్నరు. యీ హిందూ దేశములో యీ వుభయఫలములకు యింత అవశ్యకత యీశ్వరుడు కలగ చేశినాడు.

నదియ్యా అనే గ్రామము మొదలు యీ గంగధారలో సముద్రము యొక్క పోటు పాటు ప్రత్యహము రెండుమాట్లు తగులుతూ దక్షిణము రాగారాగా ఆపోటుపాటు యొక్క జోరు అవుతూ వస్తున్నది. సకల విధమైన నావాలకు రాళ్ళతోను, మట్టితోను బళువుకలగచేసి లంగరు అందముగా కొయ్యలతో నద్యావద్ద కట్టి నావాలకు నిత్యము