పుట:Kasiyatracharitr020670mbp.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శైలనాధునికి సమమవునా శ్రీకాళహస్తి నాధునిన్ని యుక్తులు చెప్పి శైవవైష్ణవులు మొదలయిన హిందువులు వారలలో వారే పోట్లాడ సాగుతూ వుంటే 3000 ఆమడ దూరములో నుంచి వచ్చిన యింగిలీషువారు హిందువులను జూచి నవ్వక అంతస్తత్వము విచారించే వోపిక త్వరలో యెట్లా కలుగును! గనుక పూర్వీకుల తాత్పర్యము యీ కర్మోద్ధారణ విషయములో యేమైనదంటే నిప్పులో నీళ్ళు పుట్టినట్టయినది.

పట్నాషహరు వదిలిన వెనక మార్చి నెల 2 తేది మూంగేరి (మాంఘీర్) అని యిప్పుడు లోకప్రసిద్ధిగా వుండే పూర్వపు ముద్గలాశ్రమము ప్రవేశించినాను. గంగామహానది సర్పము నడిచినట్టుగా అనేక తిరుగుళ్ళుగా ప్రవహింపుచున్నది. మూంగేరి ముందుగా గంగ నడమ చిన్నతిప్పలు రెండు వున్నవి. ప్రవాహకాలమందు ఆ కొండతిప్పలు ముణిగిపోను గనుక పడవలకు గుర్తు తెలిశే నిమిత్తము వాటిమీద రెండు కొడిస్తంభములు నాటివున్నారు. మూంగేరి ఖసుబా కలకటరు వగైరా అధికారస్థులు వుండే స్థలము. సకల పదార్ధాలు దొరుకును. గొప్పయిండ్లు, ఒక చిన్న కోట కలదు. జాతులవాండ్లు కొన్ని బంగాళాలు ముచ్చటగా కట్టివున్నారు. యీ షహరులో నేమి యీ చుట్టు ప్రాంత్యాలలో నేను మూంగాచీర అనే పట్టు నారమళ్ళు నేశి మన దేశానకు రావడము; యీ బట్టలను మూంగేరి చీరలనడానకు మూంగాచీరలని అభావముగా ప్రఖ్యాతి అయినది. ఆ బట్టలు యుక్కడా శానా నయము.

యిక్కడ మాకు పడవతోశే మల్లాలకు కావలశిన భక్ష్యయోగ్య పదార్ధాములు పుచ్చుకొని సాగిపోయి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే సీతాగుండ ప్రదేశానకు సమీపముగా పడవలు నిలిపీ సవారీలతో రెండుకొసుల దూరము వెళ్ళి అక్కడవుండే సీతాగండదర్శనము చేశి స్నానపానాదులు చేసినాము. ఆ సీతాగుండము సుమారు 30 అడుగుల చదరముతో తిరుకొలను వలె కట్టివున్నది. వుదకము బహు నిర్మలముగా వున్నది. వుదకముకింద రాతిగొట్టు కొండరాతిలో వూటపుట్టి తిరుకొలనులో పెట్టివుండే తూముగుండా