పుట:Kasiyatracharitr020670mbp.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిక్కడికి గోధుమ వగయిరా పయిరులకు నిండా విరోధము. అకుటోబరు నెల ఆఖరు మొదలు ఫిబ్రవరి 15 తేది పర్యంతము చలియొక్క బాధ ఒకటేరీగిగా వుండినది. పిమ్మట చలిబాధ విడిచినట్టు తోచగానే యెండలు తీక్ష్ణము కాసాగినవి. యీ వాన కురియకపోతే చలి శుద్ధ ముగా నివర్తించునట. యీ వానవల్ల వైశాఖమువరకు వుదయకాలమందు కొంచము చలి వుపద్రవము వుంటూ వచ్చునని యీ దేశస్థులు చెప్పినారు. యెట్లా శీతము యెక్కునో, అట్లా యెండయున్ను ఆ కాలములో అంత యెక్కువగా వుంచున్నదనివిన్నాను. యీ వుష్ణకాలానికి భయపడి లార్డు వుల్లియం బెంటిక్కుగారు నెపాళ దేశములో వుండే సముద్రోదకానికి పైన 27000 అడుగుల పొడుగుగా యీ బ్రహ్మాండాని కంతా వున్నత పర్వతమైన హిమాలయ పర్వతానకు యెండకాలపు కాలక్షేపము కొరకు వెళ్ళినారు. ఫిబ్రవరి నెల 18 తేది మొదలు కొని మార్చి 4 తేదివరకు వర్షప్రతిబంధకము చేతనున్ను బజరా పుల్లాకులు అనే వాడలను కుదుర్చుకోవలసి సావకాశముగా పట్నా షహరులో వసించినాను.

మార్చి నెల 5 తేది సాయంతరము పట్నాషహరు వదిలి 14 దాండ్ల బజరా ఒకటి బంగాళాకు బాడిగె 112 రూపాయలకు కుదిరి వుండగా దానిమీద సహకుటుంబముగా సవారి అయి 70 రూపాయిల బాడిగెకు పుల్లాకి యనే పడవ వొకటి కుదిరి యుండగా దాని మీద బోయీలు, కళాసులు, డేరాలు మొదలయిన సామానులను యెక్కించి ప్రయాణమైనాను. హిందుమతము యొక్క బాహ్యపు చిన్నెలు చూచి హిందువులు తెలియక చెడిపోతారనే తాత్పర్యము యిప్పట్లో యీశ్వరాజ్ఞ వల్ల హిందువులను యేలే ఇంగిలీషు జాతివారికి నిష్కర్షగా తోచివున్నది. అటువంటి తాత్పర్యము వారికి కలగడము యీ సరికి నేను వ్రాసిన హేతువులవల్ల యెంత మాత్రమున్ను వింతకాదు. గండకెగంగాసంగమ ప్రదేశములో యిక్కడ హరిహరాదుల గుళ్ళు రెండువున్నవి. అక్కడ సంవత్సరానికి ఒకసారి మహోత్సవము జరిగి లక్షావధి ప్రజ వస్తు