పుట:Kasiyatracharitr020670mbp.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడి గయావళీ ప్రేరేపణ మీద నావలెనే అష్టతీర్ధములకు ప్రత్యామ్నాయముగా రామసాగరములో పిండప్రదానము చేశినాడు. నాతో కూడా వచ్చిన మండలిమాత్రము యధావిధిగా అష్ట తీర్ధములలో నున్ను పిండప్రదానములు చేసిన వారయినారు.

12 డో దినము న్యూనపరిపూర్తి విష్ణుపాద శ్రాద్ధమని ఒక శ్రాద్ధము ఛేయవలెను. మనవారు దానికి శుద్ధ శ్రాద్ధమని పేరు పెట్టి పంచద్రావిళ్ళున్ను తమ వారిని బ్రాహ్మణార్ధము చెప్పి రెండో సారి విష్ణు పాదము మీద పిండప్రదానము చేయుచున్నారు. నేనున్ను అదే ప్రకారము ఛేసినాను. యీ శ్రాద్ధానకు గయావళీలు బ్రాహ్మణార్ధము చేయ నిచ్చయించడము లేదు. వారి వారికి యిష్టమైన వారిని బ్రాహ్మణార్ధము చెప్పుకొనేటట్టు అనుజ్ఞ యిస్తున్నారు. ఈ ప్రకారము రెండుమాట్లు విష్ణుపాదము మీద పిండ ప్రదానము చేశే టందుకు, పూర్వము, అభిషేక పూజలు చేయవలసిన విధి గనుక శ్రీరములవారు నాకు కావలసినంత సేపు గర్భగృహములో నా పరివారము యేకాంతముగా వుండేటట్టు కటాక్షించినాడు గనుక యాభైయింటికి బ్రాహ్మణులను గర్భగృహములో జమ చేసి పురుషసూక్తముతో అభిషేకము యధావిదిగా చేసి లక్ష తులసీదళములు అర్చన చేసి ఆ తులసీ రాసిమీదనే పిండప్రదానములు రెండు ఆవృత్తులు విష్ణు పాదము మీద చేసినాను. యీ విష్ణు పాదము చుట్టు తొట్టి కట్టి వుండగా ఆ తొట్టికి తంజావూరి రాజు వెండి తగుళ్ళు కొట్టించినాడు. ఆ తొట్టి నిండేటట్టు శ్రీమంతుడు 160000 వేల రూపాయిలు పోయిన సంవత్సరమున యీ దినముల లోనే అందులో పోసి గయావళీలకు పంచిపెట్టినాడు. యీ గయావళీలకు యీ లాగు ప్రవాహమువలె ఆర్జన కలిగియున్నా బ్రహ్మదేవుడు నిత్య దరిద్రులుగా వుందురు గాక యని యిచ్చిన శాపము వారియెడల సత్యముగానే వున్నట్టు అగుపడుచున్నది.


13 డో దినము ఫల్గునినదిలో సాత్రియనే మడుగులో ప్రాత స్నానము చేసి దగ్గిరవుండే గుడిలో ప్రకాశింపుచున్న గాయత్రీదెవతా దర్శనముచేసి అక్కడ అదివరకు ప్రాతస్సంధ్యలను కాలాతీరముగా