పుట:Kasiyatracharitr020670mbp.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీద చందనము సమర్పించి కుంకుమ పువ్వుతో రేఖాలాంఛనములు చందనము మీద అతి సుందరముగా యేర్పరుస్తారు. గదాధర మూర్తిని అతి సుందరముగా కల్పించి వున్నది. యీ రెండు గుళ్ళు ఫల్గుని తీరమందు వున్నవి. విష్ణు పాదానికి సమీపముగా అష్టాదశపాదాలు 'యీశాన విష్ణు ' అనే శ్లోక ప్రకారము ఒకటే పెద్ద శిల మీద వున్నట్టు వదంతి గనుక ఆ శిలకు ఒక పెద్ద మంటపము అహల్యాబాయి కట్టించి వున్నది. ఆ పుణ్యాత్మురాలు శానా ధర్మాలు యిక్కడ ఛేసి వుండెను. అది అంతా యిప్పట్లో నిలిచిపొయినవి. ఆపె ఆకృతి శిలతో చేసి గదాధరస్వామి గుడివద్ద ఆపె అన్నసత్రములో వుంచినారు గనుక ఆ బింబాన్ని చూచి ధన్యుణ్ణి అయినాను. ఆ అన్నసత్రమున్ను యిప్పుడు నిలిచిపోయినది.

2 డో దినము ఫల్గుని శ్రార్ధము క్రమముగానే ఛెయవలసినది. గయావళులను తప్ప మరి ఒకరిని బ్రాహ్మణార్దము చెప్పకూడదు. యీ దినము పెట్టే పిండాలు ఫల్గుని నదిలో పెట్టవలసినవి. బ్రాహ్మణార్ధానికి మనకు యేర్పడ్డ గయావళి వారి స్వకియ్యుల్ను పిల్చుకొని రావలసినది గాని వారి సంకేతము ప్రకారము మనము పిలిస్తే వారు రారు. యీ గయావళీలు యెందరు యెక్కడ వచ్చి యాత్రవారిని కల్సుకున్నా యజమానుడు యిచ్చవచ్చిన వాణ్ని నీవు నా గయావళీ అని నియమించి మిగిలిన వారిని నాకు అక్కరలేదని చెప్పవచ్చును. కాశీ ప్రయాక స్థలముల వలెనే నిర్బంధము లేదు.

3 డో దినము షహరుకు ఉత్తరపు పక్క 3 కోసుల దూరములో వుండే ప్రేతపర్వతానికి పోవలసినది. కొండకింద బ్రంహ్మగుండము అనే తీర్ధము ఒక గుంట అందముగా వున్నది. గయావ్రజనము చేసే వారికి గయావళి మూలకముగా పిండపిచ్చి యనే అంగటివాడు ఒకడు యేర్పడుతాడు. ఆ యా దినానికి పెట్టవలసిన పిండాలు తెలిసి పిండ మామగ్రీలు బ్రాహ్మల కయితే బియ్యము యితరులకు యన పిండిన్ని నువ్వుల్ దర్భ తేనె నెయ్యి మృణ్మయ పాత్రలో పెట్టి యిస్తాడు. వానికి అష్టగయ చేసేవారు రెండురూపాయిలు యివ్వవలసినది. యీ షోడశీ ఆ పిండ సామగ్రీని తీసుకొని