పుట:Kasiyatracharitr020670mbp.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సకలవిధములయిన ధాన్యములు పరిత్యజించి కందమూలాదులు శింగాణి పిండిన్ని తిని వ్రతము ఆచరింపు చున్నారు.

బ్రాహ్మణులకు దక్షిణ దేశములో భట్లు, అయ్య అని పౌరుష నామధేయ్ములు స్వనామముతో కలిసివుండేటట్టు యీదేశములో బ్రాహ్మణులకు పాడె, దూబె, చౌబె, మిశిరి, తేల్వాడి, అని పౌరుషనామధేయాలు కలిగి వున్నవి. యీ పంచగౌడు లని పంచ ద్రావిళ్ళనిన్ని భేదము కలిగి వుండడమే వాటికి కారణముగా వున్నది. మిక్కిలి విచారించగా నా బుద్దికి తెలియ బడ్డది యేమంటే సుమారు వెయ్యున్నేనూరు సంవత్సరములకు ముందర హిందువులు వసించే హిందూస్తాన్ అనే యీ గంగా యమునల మధ్యేవుండే భూమి మ్లేచ్చ భూమి అయిన పార్షి దేశానికి సమీపము అయి వుండగా కాబూలు కనమగుండా సింధువనిన్ని హిందువనిన్ని ద్వినామక మయిన మహానదిని దాటి కలి సాంమ్రాజ్య ప్రేరణచేత మ్లేచ్చులు* డిల్లి అనే హస్తినాపురి ప్రవేశించి కర్మద్వారా బ్రాహ్మణులు అయివుండే వారికర్మములు సాగకుండా వారిని భ్రష్టులను చేశేకొరకై అనేక హింసలు చేసినందున యీ రాజ్యము యావత్తు మ్లేచ్చాక్రాంతమైనందున యీ దేశస్థులు కర్మమును నిండా పాటించను వయిపులేనివారైరి.

యిప్పట్లో దాక్షిణాత్యులయున హిందువులు స్వభాషతో యింగిలీషుమాటలు కలిసి మాట్లాడుతూ వచ్చేటట్టు యిక్కడ దొరతనము చేసేవారి తురకమాటలు సంస్కృతభాషతొ యీ డేశస్థులు కలిపి మాట్లాడుతూ తురకలవలెనే వస్త్రవాహనాద్యలంకారాలను అంగీకరించి ప్రవర్తిస్తూ వఛ్ఛేటట్టు తెలిసినది. అయినప్పటికిన్ని ముఖ్యమయిన వర్ణాశ్రమ ధర్మాదులు మాత్రము యిక్కడివారు వదిలినారు కారు.


  • మ్లేచ్చుల దండయాత్రలు: క్రీస్తుకు పూర్వము 300-200 శరాబ్దములలో మన దేశమునకు (గ్రీకులు) వయనులు, శాకులు వచ్చిరి. క్రీస్తు తరువాత కూడా యీచీ మొదలకు ఆశియా తెగలువచ్చిరి. క్రిస్థుశకము 5,6 శతాబ్దములలో, హూణులు, 8 వ శతాబ్ధములో అరబ్బీలు, తరువాత ఆఫ్ఘనులు పారశీకులును వచ్చిరి. వీరినందరిని మనవారు మ్లేచ్చులనిరి.