పుట:Kasiyatracharitr020670mbp.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ద్రావిళ్ళు పంచగౌడులతో చేరిన యాచకులు 15000 మంది దాకా వున్నారు. అందులో పంచద్రావిళ్ళు సగమని చెప్పవచ్చును.

ఈ కాశిలో వుండే వుపద్రవాలు మూడని చెప్పుకొనుచున్నారు. అవి యేవంటే - 'రాండు - సాండు - చీడీ' అని మూడు వుపద్రవాలు కలవు. రాండు అనగా విధవస్త్రీలు, సాండు అనగా వృషభములు, చీడీలు అనగా మెట్లు. విధవలు నిండా యాచించడము చేతనున్ను,దుర్మార్గపు బాలవిధవలు ఇతర నడతలు కలిగి యుండుట చేత నున్ను వారివల్ల బహు పీడ లోకులకు కలిగి యున్నది. వృషోత్సర్జనము చేసి లోకులు అనేక వృషభములను పట్టణములో విడిచి పెట్టినందున యీ గల్లీలలో మనుష్యులతోటి పాటు మెలగి సంచరింపుచు ఉంచున్నవి. ఇట్లా నుండగా వాటికి రంధి పుట్టినప్పుడు మనుష్యులను చాలా హింస పెట్టుచున్నవి. చీడీలని ప్రతి గల్లీలలో మెట్లు యెక్కి దిగవలసినది. వైపు తప్పి పడ్డవారికి కాళ్ళు చేతులు విరగడము కద్దు.

గొసాయీలు ధనికులుగా మహాజనాలనే పేరు పెట్తుకుని సాహుకారు పనులు చేయుచున్నారు. భిక్షాటకులుగాను బహు మంది బయిరాగులతోటి పాటు సంచరింపుచు ఉన్నారు. కంగాళీలనే భిక్షాటకులకు లెక్కలేదు. సవారీ సమేతముగా యాత్ర వచ్చేవారిని యాచించే కంగాళీలు పక్కీతులు గల్లీలలో సవారీని సాగనియ్యరు.

ఈ కాశీ మహా క్షేత్రములో అధర్వణ వేదమును కొందరు ఘూర్జరులు అధ్యయనము చేసి యున్నారు. ఆ వేదస్వరము ఋగ్వేదస్వరమునకు సమీపముగా నున్ను, ఉదృతముగా నున్ను, యున్నది. యజుర్వేద్ములో మాధ్యందినశాఖ యని శుక్లయజుశ్శాఖ యని ప్రధమ శాఖ యని తైత్తిరీయశాఖ యని సర్వభేదములతో అధ్యయనము చేయుచున్నారు. ఇక్కడ సామగులు నూటిదాకా యున్నా స్వరము దక్షిణ దేశమునకు బహు భేదముగా నున్నది; గాన సౌష్టవము విస్తారములేదు. పంచద్రావిళ్ళలో పంచగౌడులలో నున్ను ఒకటి రెండు శాస్త్రాలు చదివిన పండితులు వెయిమంది దాకా ఈ కాశీలో యున్నారు. న్యాయశాస్త్రము ఇక్కడ నిండా ప్రచురము.