పుట:Kasiyatracharitr020670mbp.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కూడావున్న కంబళిదేరా ఒకటిన్ని, శిఫాయిడేరా ఒకటిన్ని ఒక కళాసునున్ను కూడా పడవలమీద ఉంచుకుని, గుర్రాలను, ఒక జత బోయీలను, కావడివాండ్లను, కాయలా మనుష్యులనున్ను మెరకను పంపించి బయలు చేరినాను.

గంగలో రాతిగొట్టులేదు. గంగాతీరమునందు వసతి అయిన ప్రదేశములో దిగి రాత్రి పగలున్ను వంట చేసుకొని తర్లిపోవుచు వచ్చినాము. ప్రవాహపు వడిచేత గంగమధ్యే మిట్టలు పెట్టుచున్నవి గనుక పడవలు, బజరాలున్ను మిట్టతగిలి పగిలిపోతున్నదనే భయముచేత రాత్రిళ్ళు పడవలు ఇక్కడ నడిపించరు. చేకటిపడగానే ఒక తావున పడవలు నిలుపుతారు. గంగలో సాయంకాలమునందు పరంగి కొండశాలలో గుఱ్ఱపుబళ్ళు నడిచేటట్టు *పడవలు బజరాలున్ను వచ్చుచుపోవుచున్నవి. గాలిలేక ప్రవాహానికి యెదురుకొని పడవలు పోవలసినప్పుడు పడవలకు తాళ్ళుగట్టి గట్టుననుండే మనుష్యులు యీడ్చుకొని పోతారు. ప్రవాహపు దారిగా గాలికి యెదురుకొని పొయ్యే టప్పుడు కొయ్యలతో నీళ్ళు తోస్తూ పోతారు. గాలి అనుకూలించి నప్పుడు ప్రవాహపుజోరు కలిగిన తావులలో చాపలుకట్టి మాలీలు వూరికే కూర్చుంటారు. చుక్కాణివాడి జాగ్రత మాత్రము సర్వకాలమందు న్నుండవలసి యుంచున్నది.

గంగ భూమి మట్టానికి బహు లోతుగా ప్రవహింపుచున్నది గనుక ఊళ్ళు నిండా గంగ సమీపమునందు ఉండకపోయి నప్పటికిన్ని గంగకు యిరుపక్కల అడుగుకు ఒక ఊరు వున్నట్టుగా దగ్గిర దగ్గిర ఊళ్ళు వుండి వున్నవి. వాటి పేళ్ళు విచారించడానికి గంగలో రావడముచేత పయిపు లేకపోయెను. వాటి పేళ్ళు పడవతోశే మాలీలకు కూడా తెలియదు. గంగలో రాగా కనుపడ్డ ప్రసిద్ధ స్థలాలు యేవంటే వింధ్యవాసిని 1, మిరిజాపూరు 2, చెన్నాడుగడ అనే బస్తీకోట కలిగిన షహరు 3, చోటా కలకత్తాయనే దండు 4, రామనగరము వ్యాసకాళి అనే ద్వినామములు గల బస్తీ షబరు 5.


  • చెన్నపట్టణములో ఆనాడు దొరలు విహరించు స్థలము మౌంటు రోడ్దులో నీడకోసం రెండుపక్కలా వెయబడిన చెట్ల బజారులోనే.