పుట:Kasiyatracharitr020670mbp.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగుపడలేదు. యిది గాక శ్రీమచ్చంకరాచార్య భగత్పాదులవారు దిగ్విజయార్ధముగా ఈ దేశానికి వచ్చిన కాలములో యిక్కడ సన్యాసమును స్థాపించిన వెనక ఈ గౌడులలో కొందరు సన్యసించి వారికి సిష్యభావమును వహించి ఉంటూ వచ్చినారు. భగత్పాదుల వారికి కొందరు మద్య మాంసాదులతో భిక్షచేసినప్పుడు గురువు స్వీకరించగా మేము యెందుకు విడిచి పెట్టవలసిన దని వారితో పాటుగా ఈ దేశపు శిష్యులు మద్య మాంసాదులను భక్షించినారు. పిమ్మట వారి పరిక్షార్ధమై ఒక కంచరవాడు సీసమును కరిగి ఆయుష్ణముతో భిక్షాకాలమందు భగత్పాదుల వారికి పాత్రతో సమర్పించగా దాన్ని భగవత్పాదులవారు సమదర్శను లయినందున ఉదక ప్రాయముగా పుచ్చుకొన్నారు. ముందు వారితోటి పాటుగా మద్య మాంసములను పుచుకొన్న గౌడ సన్యాసులు యిది మేము పుచ్చుకో గలమా అని కరిగించి పోసిన సీసమును తాగలేక త్యజించి నందున భగవత్పాదుల వారికి వారి యెడల ఆయానముతోచి, బుద్ధి స్ధైర్యమును పొందేవరకు లోకదృష్టితో మంచిచెడు తారతమ్యములను విచారించక నాయందు గౌరవమున్ను లేకుండా అవాంకృతిని వహించి నందున మీరు భ్రష్టులై పోదురు గదా యని శపించినారు.

అప్పట్లో శాపగ్రస్తులయిన పదిమంది సన్యాసులున్ను దశనామములు కలిగి శిష్యప్రశిష్య పరంపరగా యీ దేశములో గోసాయీ లనే పేరు తమది సన్యాసాశ్రమమైనా వర్తకవ్యాపారాలు చేసుకొంటూ యిక్కడ మహాజనులనే సాహుకారులుగా నటింపుచున్నారు. ఆతొసాయీలు సిష్యపరిగ్రహము చేసేటప్పుడు ఒక విధమయిన హోమముచేసి కొంత ఆగమము జరిపించి శిష్యపరిగ్రహము చేయుచున్నారు. ఆ శిష్యుడు గురువుయెక్క ధన ఋణాలకు బాధ్యుడవుచున్నాడు. యిట్లా మునుపు గోసాయీలు బ్ర్రాహ్మణవ్యతిరిక్త జాతులను కూడా శిష్యులుగా పరిగ్రహింపుచు వచ్చినారు. అయితే యిప్పుడు కొంతకాలముగా కుంఫిణీవారు ఆ యాచారమును నిలిపి బ్రాహ్మణులనే శిష్యులుగా పరిగ్రహించేటట్లు