పుట:Kasiyatracharitr020670mbp.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇహసుఖమును కోరిన ప్రకారముగా అనుభవించి మళ్ళీ యీ క్షేత్రమందే మరణము కలిగి అవతల జన్మమము లేకుండా ముక్తిని పొందునని పురాణమందు చెప్పబడియున్నది. యీస్థల మహాత్మ్యము ద్వాదశాధ్యాయములు గలది ఒకటిన్ని శతాధ్యాయములు గలది ఒకటిన్ని యిచ్చట శ్రవణము చేయబడుచు నున్నది. ఈ క్షేత్రమందు స్నాన దానాలకు మకర మాసము ముఖ్యము. అప్పట్లో లక్షోపలక్ష ప్రజలు వచ్చి యాత్ర చెసుకొని పోతారు.

యిక్కడ స్వేచ్చా మరణము వల్ల యిష్టసిద్దిని జన్మాంతరములో పొదుటచేత ముచికుంద బ్రహ్మచారి అనే తపస్వి సార్వభౌమత్వము కోరినవాడై నడుము దాకా దేహాన్ని బద్దలుగా కోసి అహుతులు చేసి యిక్కడ దేహము చాలించినాడు. అతని శిష్యులు జన్మాంతరములో అతనికి పరిచారకులుగా వుండవలెననే ప్రార్ధనతో ఆ హోమాగ్నిలో ధుమికి దేహాలు విడిచినారు. వీరి కందరికిన్ని జన్మాంతరములో పూర్వ జన్మజ్ఞానము వుండవలె ననే ప్రార్ధనకూడా వుండినందున యీ స్థల మాహాత్మ్యాన్ని ప్రస్తుతి చేసినట్టుగా యెనిమిది శ్లోకాలు వ్రాసి బొరుగులు వేయించి అమ్మే ఒక స్త్రీ వశముచేసి చనిపొయినారు గనుక ఆ బ్రంహ్మచారి ఢిల్లికి అకుబరు ఫాదుషాగా నున్ను శిష్యులు మంత్రులుగా నున్ను అయిన వెనక జన్మాంతరజ్ఞానము వున్నందున మళ్ళీ ఈ స్థళానికి వచ్చి తాము శ్లోకాలు వ్రాసివుంచిన స్త్రీ బ్రతికి వుండగా ఆపెవద్ధ పూర్వము వ్రాసివుంచిన శ్లోకాలు తీసి చదువుకొని ఆశ్చర్యపడి స్వేచ్చా మరణము కోరినవారికి యిక్కడ అనుకూలముగా మెడయిస్తే తృటికాలములో అనాయాసముగా తెగకోసే యంత్రము ఒకటి వుండగా తమకు బాధగా వుండుననే వెర్రి తాత్పర్యముతో ఆ యంత్రాన్ని యెత్తి పారవేసి త్రివేణీ సంగమము వద్ద అత్యద్భుతమయిన కోట వకటి కట్టినారు. ఆ కోట యెంత ప్రవాహాలనున్ను ధిక్కరించి అత్యంత బలముగా యిదివరకు ఉన్నది.

ఆ సువర్ణాక్షయపటము కలి సామ్రాజ్యకాల మయినందున త్రివేణీసంగమము వద్ద వున్నా యిప్పట్లో ఆదృశ్యమయి యున్నది.