పుట:Kasiyatracharitr020670mbp.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగుల వీరాస్వామయ్యగారి

గొప్పవూరు. సకలపదార్ధాలు ముసాఫరులకు కావలసినవి దొరుకును.

యీవూరినుండి ఒక గుంటవద్ద నేను దిగినంతలో ఒక సమూహముగా స్త్రీలు పురుషులున్ను సుమారు యిన్నూటిదాకా ఒక చెట్టు నీడలొ నిశ్చబ్దముగా కూర్చుండి ఒక పురుషుణ్ణి సమూహముమధ్యే వున్నతాసనము మీద కూర్చుండబెట్టి వాడు చదివిచెప్పే అర్ధాన్ని వింటూ వున్నారు. ఏమని విచారించగా భాగవత గ్రంధ కాలక్షేపము జరిగేటట్టు తెలిసినది. యిదేప్రకారము మిరిజాపూరులోను జరిగేటట్టు వినివున్నాను. ఇంత సమూహములో ఒకరయినా యిన్ని పల్లకీల గుంపుతో వచ్చి నన్ను తిరిగి చూచినవారు కారు. తదేక ధ్యానముగా పురాణశ్రవణమే చేస్తూ వచ్చినారు. యింత యెండలో నియమముగా ఉపవాసముతో చిత్తాన్ని తదేకాగ్రముగా వుంచి భగవత్కధాశ్రవణము చేసే క్రమములో నిశ్చలమయిన మనస్సు కలవారికి ఉత్సవ విభవాలు జరిగే దేవాలయాలు భక్త్యాకర్షణ నిమిత్తమయి యేమిజరూరు? అందునుంచే శీతభూమిని నివసించే వారికి యధోచితమయిన చిత్తస్తాస్థ్యము కద్దని లోగడ నేను వ్రాసిన ప్రకారము, ఈదేశములొ ఉత్సవవిభవాలు జరిగే దేవాలయాలు విశేష ధనవ్రయాలుచేసి పూర్వీకులు కట్టినవారుకారు. తదనుసారముగా యిప్పటివారున్ను కట్ట నిచ్చయించిన వారు కారని తోచుదున్నది. యీవూళ్ళో యీరాత్రి పగలున్ను వసించడ మయినది.,

10 తేది ఉదయాత్పూర్వము 3 ఘంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములోవుండే అండ్యాసరాయి అనే వూరు 3 ఘంటలకు చేరినాను. దారి రమణీయమయిన సడక్కువేసి కాలువలకు పూలు(వంతెన) అనే వారధులు కట్తి మయిలుకు వకరాయి వంతున కుంఫిణీవారు రాళ్ళువేసినారు. గులక లేకపోయినా ఘట్టన బాగా పడివున్నది. యీ సడక్కు ప్రయాగకున్ను కాశికిన్ని వేసివున్నది. యీ గోపీగంజు మొదలు యిదే ప్రకారము కాశివరకు సడక్కువేసి వున్నదట. జబ్బల్ పూరు వదిలినవెనుక యెండలు కొంచెము కొంచెముగా తీవ్రములు అవుచు వచ్చి మిరిజాపురము చేరేటప్పటికి పడమటిగాలి సమేతముగా అతి తీవ్రములయినవి. 9 ఘంటలమీద