పుట:Kasiyatracharitr020670mbp.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

పురోహితునిచేత మన దేశాచారప్రకారము స్త్రీ సూక్తప్రకారముగా యధోచితముగా షోడశోపచార పూజ చేయించి కుంకుమతోను, పుష్పాలతోనున్ను, అర్చన చేయించినాను. పూజాకాలమందు అయిన నామోచ్చారణలు బాగావున్నవని యిక్కడివారు ఆనందించినారు. ఆదేవీ నివేదనానికి గుడికి తీసుకపోయిన పదార్ధాలు మళ్ళీ బయటికి తేనియ్యరు. బ్రాంహ్మణభోజనాని కని చేయించే పదార్ధాలు విడిదిలోవుంచి మితముగా నివేదనార్ధమై గుడికి తీసుకపొవలసినది. యీవూరిలో బజారు వీధి వున్నది. సకల పదార్ధాలు దొరుకును. ఈ పండ్యాలు వెయ్యింటిదాకా వుంటారు. వీరుగాక యాచకులు అనేకులు గలరు. యీ మహాస్థలములో యీరాత్రి వసించినాను.

9 తేదీ ఉదయాన 5 ఘంటలకు లేచి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే గోపీగంజు అనేవూరు 11 ఘంటలకు చేరినాను. వింధ్యవాసిని వూరిముందరనే గంగదాటవలసినది. దారికి సడక్కు లేదు; పాలరేగడిభూమి. అడుగడుగుకు వూళ్ళు కలవు. మెరికపయిరు భూమి. యిక్కడ గంగ దాటే తావున ఒక పెద్దవాగు గంగలోవచ్చికలుస్తున్నది. యీవాగు వొడ్దుగానే కొంతదూరము దాటిన వనక భాట పొవుచున్నది. యీ గొపీగంజు అనేవూరు రమనగరపు రాజుది. యీవూళ్ళో ముసాఫరులు దిగడానకు ఒక సరాయి కట్టియున్నది. యిదిగాక యీ రాజుకింది తాశ్శీలుదారుడు ఒక గుంటతవ్వి ఒక బంగాళా కట్టి దానిచుట్టూ సరాయిచట్టముగా అరలు కట్టినాడు. నేను అక్కడ దిగినాను. యిది మొదలుగా హిందూస్తాను తుదవరకు అక్క డక్కడ సరాయీలు కట్టి వున్నదట. ఆ సరాయీలకు తురకలేగాని యితరులు ఖావందులు కాకూడదట. అందుకు పాధుషా హుకుము వున్నదట! యీసారాయిలు కల తురకలు, దిగే మనుష్యులవద్ద వర్షాకాలములొ ఎక్కువగానున్ను, ఎండాకాలములొ తక్కువగానున్ను, మనిషికె సుమారు ఒకటి రెండు పయిసాలవంతున బాడిగె పుచ్చుకుంటారు. యీ సరాయీలు లాలుగంజులొ వుండే సరాయివలెనే కట్టియున్నవి. సర్కారుతరపున రాత్రిళ్ళు యిక్కడ యిద్దరేసి ఠాణావాండ్లు పారాయిస్తూ వుంటారు. యీ గోపీగంజు