పుట:Kasiyatracharitr020670mbp.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

వేస్తారు. వెలుతుర అయ్యెదాక సామాన్యుల నిమిత్తము తలుపులు తెరవరు. ఈలోగా లోపలనుండే మనుష్యులకు దేహబాధ శానాగా వుంటున్నది. యీ వూరిలో సకల పదార్ధాలు దొరుకును బస్తీ అయినదేను. యీరాత్రి యీ సరాయిలోనే వసించినాను.

26 తేదు ఉదయాన 6 ఘంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములోవుండే మిరిజాపూరు అనే గంగగట్టు షహరు 12 ఘంటలకు ప్రవేశించి గంగా దర్శనము చేసి ఆనందించినాము. పరమాత్ముడు గంగానదిలో విస్తరించిన దీప్తితో ప్రతిఫలించి అనేక కోటి జనుల పాపములను వారి భక్తి ద్వారా పరిహరించి వారలను పావనులుగా జేసి యిష్టసిద్ధుల జేయుచున్నాడు. గనుక ఆమహానదీ దర్శనాపేక్షతులయి వచ్చిన మాకు ఆ గంగాదర్శనము కావడములో వున్న తృప్తి వ్రాసితీరదు. నేటి దారి శానాదూరము రాతి పొరగనుక వేసిన సడకు చెదరకుండా పాంధులకు హితముగా వున్నది. కట్రా వద్ద కొండ దిగినట్టుగా యీ దినమున్ను ఒక చిన్న కొండ దిగవలసినది. ఆ కొండ దిగుడు బహు వయిపుగా కుంఫిణీవారు బండ్లు కూడా చులకనగా దిగేటట్టు కొండ దారి చేసినారు. ఇది వింధ్యపర్వతము నుంచి దిగడమని తెలుసుకోవలసినది. దారిలో భగవ్రాతలావు, తులసీతలావు అనే చిన్న వూళ్ళూ కొన్ని వున్నవి. దారి వెల్లడి గాని అడివిలేదు. ఆ కొండ యేమి కట్రావద్ద కొండ యేమి దిగేటప్పుడు కిందవుండే భూమిని మీదినుంచి చూస్తే వుండే శృంగారము అనుఃభవవేద్యము కాని వ్ర్రాయశక్యము కాదు. దారిలో నాల్గు నదులు దాటవలెను. మయిహరు మొదలుగా దాటే నదులు పశ్చిమ వాహినులుగా కొన్ని ప్రవహిస్తూ వున్నవి.

యీ మిరిజాపూరు అనే వూరు గొప్ప షహరు. చెన్నపట్టణము వలెనే వీధులు తీర్చబడి అంగళ్ళు యిండ్లు మొదలయినవి బహు సుందరముగా నున్ను, వున్నతముగా నున్ను, కట్టబడి యున్నవి. యీ హిందూస్తాని కంతా యిక్కడి పాత్రసామాగ్రీలు ప్రసిద్ధమయినది. ఘనుక పాత్రసామానుచేసే కంచరవాండ్లు వెయుకడపదాకా అహోరాత్రిళ్ళు యీ వూళ్ళో పని చేస్తూవుంటారు.