పుట:Kasiyatracharitr020670mbp.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

యింత చిన్న మజిలీ చేసినాను. డోలీ అనగా ఒక చిన్ననులకమంచానికి బొంగు కట్టి యిద్దరు మోసేది. యిక్కడి బోయీలను డీమర్లు అంటారు. వారిద్దరు అటువంటి డోలీని సాధారణముగా నా సవారితో కూడా మోసుకొని వచ్చిరి. దారి నిన్నటి దారివలెనె అనుకూలమయినది కాదు. ఈవూరు చిన్నది. జలవసతి కద్దు. దీన్ని యీ దేశపు బ్ర్రాంహ్మణునికి రీమారాజు యీనాంగా యిచ్చినాడు. మజిలీవూరు కాదు గనుక ప్రయత్నము మీద బియ్యము మొదలయిన సామానులు అందిరికిన్ని దొరికినవి. యిక్కడ యీరాత్రి డేరాలలొ వసించినాను.

22 తేది ఉదయాత్పూర్వము 3.4 ఘంటకు లేచి యిక్కడికి 3 కోసుల దూరములో వుండే రీమారాజుయొక్క రాజధానిని (రీమా) చేరినాను. నడిమివూళ్ళు. 14 వుమరి - 1 - రీమా 1.

దారి నిన్నటివలెనే వున్నది. రీమా అనేవూరిముందర తమసా అనే నది మళ్ళి దాటవలసినది. ఈనది గంగలోనుంచి చీలివచ్చేదిగా చెప్పుతారు. రీమా బహు గొప్పవూరు. కోటలోపల రాజు వుంటాడు. కోటకు బయిట అంగళ్ళు మొదలయినవి వున్నవి. వూరిచుట్టు తొటలు గుంటలున్ను కొన్నివున్నవి. సకలమయిన పదార్ధాలున్ను దొరుకును. చింతపండుకూడా బహు ప్రయత్నముమీద ఒక శేరు యిక్కడ దొరికినది. నాతో కూడా వచ్చిన స్వదేశపు పరిజనులు మిరపకాయలు చింతపండు తిననందున మాకు రోగాలు వస్తున్నవని భ్రాంతిపడి చెప్పుతారు. వారికి చింతపండుకు బదులు గోగుకూర చింతాకు చింతపెందెలు దొరుకుచు వస్తున్నవి. ఉపపన్నులయిన యాత్రవచ్చేవారు నా వలె మోసపోకుండా స్వదేశ పరివార రక్షణ నిమిత్తమై 2 నెలలకు చాలేపాటి చింతపండు మిరపకాయలు మిరియాలు ఆవాలున్ను నాగపూరులొనే జాగ్రత్తచేసుకొని కూడా తీసుకొని రావలసినది. లోగడ నేను వ్రాసిన ప్రకారము కోసుకు మూడుకోసులుగా వుండే కొండకోసులు నర్మదానదితొసరి. జభ్భల్ పూరు మొదలుగా అనుకొనే కొసులు కొంచమెచ్చుగా మనదేశపు కోసులకు సరిపడుచున్నవి.

నాగపూరు మొదలుగా వక్కలులేవు. పోకలు వొత్తికాచుతో