పుట:Kasiyatracharitr020670mbp.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

రఘోజీబాబా తీసుఒన్నాడు. పిమ్మట 12 సంవత్సరముల కిందట రఘోజీ వగయిరా రాజులతో యింగిలీషు వారికి కలహము పొసగినంతలో వారు ఈ జబ్బల్పూరునున్ను యిక్కడికి సమీపములోనుండే సాగరా మొదలయిన భూములనున్ను ఆక్రమించుకొని రాజ్యము చేయుచున్నారు. మళ్ళి నాగపూరు రాజ్యమును రఘో దౌహిత్రునికి యిచ్చినా ఈ జబ్బల్పూరు పరగణాలు పూర్వము సాగరారాజుది గనుక సాగరారాజుకు పుత్ర సంతతి లేక అతని భార్య రాజ్యము చేయుచు నుండి యుద్ధ ప్రసక్తి పెట్టుకోకనే రాజ్యమును యింగిలీషువారి అధీనము చేసి సాలుకు వీరు యిచ్చిన లక్షరూపాయిలు తీసుకొని భోజనము చేయుచున్నది గనుక ఆపె తరపున ఈ జబ్బల్ పూరు రాజ్యమును తాము పుచ్చుకొన్నందున ఈ రాజ్యము నాగపూరితొ చేరినది కాదని కుంఫిణీవారు అనుభవింపుచున్నారు.

రఘోజీ రాజు యీ రాజ్యూమును కట్టుకున్నది మొదలు ఈ జబ్బల్ పూరు బస్తి అవుచూ వచ్చినది.; యిప్పుడు యింగిలీషువారి దొరతనమయిన వెనక బజారు వీధులు రాజవీధులున్ను విశాలముగా లక్షణముగా కట్టించి బహు సుందరముగా నిర్మలముగానున్ను పెట్టుకొని యున్నారు. సారవత్తయిన భూములు గనుక అనేక తోటలు వూరి చుట్టున్ను వేసియున్నారు. ఇప్పుడు సివిల్ అధికారముచేసి దొరలు ఊరికి 2 ఘడియల దూరములో సుందరమయిన తోటలు వేసి బంగాళాలున్ను కట్తుకొని శాలలు (నీడకోసం రెండుపక్కలా పాతిన చెట్ల వరుసలు) వేసి వేడుకగా కాపురమున్నారు. ఇక్కడ నుండే సుమారు ఒక పటాలం దండున్ను అందుతో చేరిన డాక్టర్ మొదలయిన దొరలున్ను మరియెక పక్క తోటలో బ్యారుకమలు కట్టుకొని కాపురమున్నారు. సకల పదార్ధాలు దొరుకును. కండ గలిగి గొప్పవిగా నుండే దోసకాయలు విశేషముగా అమ్ముతారు. పలవర కాయలు ఇక్కడ శానా దొరుకును. ఇక్కడనుంఛే దేశాంతరమందలి ప్రభువులకు సారిపోవు చున్నారు. బారెడేసి నిడువుగల బీరకాయలు, అమితముగా అమ్ముచున్నారు. బట్టలు పాత్రసామాను ఆయుధ విశేషాలున్ను నయముగా అమితముగా అమ్ముచున్నారు.