పుట:Kasiyatracharitr020670mbp.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

నిన్నటివలెనే కొఠాయిలు, చావిళ్ళున్ను కట్తియున్నవి. రమటెంకి మొదలుగా ఉండే టప్పమనుష్యులు శిమినీ టప్పారయిటరు యొక్క ఉత్తవుకు లొబడ్డవారైనా నాగపూరి యిలాకా టప్పా డభేదారులు ఇద్దరు నాతోకూడా వచ్చినారు గనుక వారి పెత్తనమవల్ల కురాయి దాకా టప్పా మనుష్యులను మజిలీ మజిలీకిన్ని తెచ్చినాను. రామటెంకి మొదలు కొండ్కోసులను పక్కాకోసులని చెప్పుతారు. ఒక పక్కా కోసుము మూడు కచ్చాకోసులు. ఒక కచ్చాకోసుకు 2 మయిలు లని యిక్కడివారు చెప్పినారు. ఈ యూరున్ను నిన్నటి యూరివలెనే నిండా బస్తీకాకపొయినా ముసాఫహరులకు సౌఖ్యము కలుగచేయడానకు సకల విధాలా చాలియున్నది. యీ నాగపూరి రాజ్యము ప్రవేశించినది మొదలుగా ప్రతియూరిలో నున్ను చెరువు కలదు గనుక జలవసతి అయిన గ్రామమే. యిక్కడి చెరుఫులలో శింగాడి కాయలని పయిరుపెట్టుతారు. ఆ కాయలలో బాదంపప్పుజాడగా విత్తులు ఉన్నవి. ఆవిత్తులను పిండిచేసి ఉపవాస దినాలలో పూరీలుగా కాల్చి ఫలహారము చేస్తారు. యధోచితమయిన తీపుకలిగి ఉన్నది. ఆ పిండి ఆరొగ్యకరమయిన దని చెప్పుతారు. ఆ యూరిలో ఆ రాత్రి వసించినాను.

31 తేది ఉదయాన 6 ఘంటలకులేచి అక్కడికి 6 కోసుల దూరములో నుండే చావిడి అనే ఊరు 12 ఘంటలకు చేరినాను. నడిమె ఊళ్ళు. నెంబరు3 - మొహగాం- 1 సూకుతలా 2 - గోపాల పూరు 7. ఆ యూరిలొ నున్ను ఆరీదిగానే కొట్టాయీలు దుకాణపు దారులు కట్టి యుంచినా బస్తి అయిన వూరుగనుక బజారు వీధులలో జనసమ్మర్ధముగా నుండుటచేత మనసుకు రమ్యముగా నుండలేదు. కురాయిపూరు దాటగానే కొండయెక్కి దిగవలసినది. ఇక్కడ వింధ్యపర్వతమును ఆరోహణము చేయవలసిన దనేది ప్రసిద్దముగా నున్నది. భాటరాతిగొట్టు; నల్లరేగడ కొంతమేర కొండదిగగానే యెర్రరేగడగా నున్నది. ఆడివి మధ్యేభాట. దారిలో కొన్ని వాగులున్ను దాటవలెను. ఈ కొండ యెక్కగానే యాత్ర వెళ్ళేవారు వింధ్యవాసినికి ప్రీతిగా కొన్ని టెంకాయలు కొట్టి చూరవిడుచు చున్నారు.