పుట:Kasiyatracharitr020670mbp.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరుగుర్రాలను కాశికి పొవడానకు గుర్రము 1 కి రూపాయిలు 15 లెక్క బాడిగకు మాట్లాడి జుములా గుడారాలు 4 కంబళి 1 అందుకు తగ్గ బొంగులు, మేకులు, కింద వెయ్యడానకు కీలుచాపలు, ఇవంతా ఆ యారు గుర్రాలమీద సాగించుకొని రావడ మయినది. హయిదరాబాదు నుంచి వచ్చిన యెద్దులకు మళ్ళీ అవి స్థలము చేరడానికి 14 దినముల జీతము కట్తియిచ్చి పంపించివేయడ మయినది. యింతే గాకుండా ఒక కావటి మనిషి బళువులో 3 మంచాలు కావలసినప్పుడు తీసి మళ్ళీ జోడించేటట్టు చేయించి, డేరాలలో చెమ్మగా నున్నా పండుకొవడానికి విరోధము లేక నుండేటట్టు చేసుకొన్నాను.

ఇక్కడ నాగపూరి రూపాయి యనేది ఒక్కటే చెలామణి. రూపాయల మార్పులో హయిదరాబాదు వలె చేతికి చెయ్యి నష్టము తగలదు. దుడ్లుమాత్రము నాలుగేసి యూళ్ళకు ఒక్కొక్క మాదిరి చలామణి అవుచున్నవి. ముందు చెలామణి దుడ్ల వయినము విచారించుకొని అప్పటప్పటికి దుడ్లు మార్చుకొనుచు రావలసినది. నాగపూరు రూపాయి 1 కి ఇక్కడి దుడ్లు 32 దుడ్ల భేదము కొద్ది సంఖ్యవ్యత్యాస మవుచున్నది.

నేను చెన్నపట్టణము వదిలి నప్పుడు కావలసిన సామానులనుంచు కొనేటట్టు పల్లకీలో జాగా చేయవలె నని తోచినది. పిమ్మట పల్లకీ బళువుచేత దారి సాగక పోయినంతలో వేసుకొనే పరుపుకూడా తీసివేసినారు. గనుక పాలకీ దొవప్రయాణానికి చులకనగా ఉండుట మేలు.

ఇక్కడ 13 సంవత్సరములుగా వాసము చేయుచు నుండే డాక్టరు వొయిల్ (Dr.Wylie) గారితో మాట్లాడగా నాగపూరు మొదలుకొని జబ్బలపూరు వరకి అడివి బలిసిన భూమి గనుక అది కొత్త నీళ్ళతో తడిసి ఆ యడవిలోని ఆకులు మురిగి వాటి రసముతోనే వూట యెక్కుటచేతను ప్రతి సంవత్సరమున్ను ఆగస్టు ఆఖరు మొద్లుగా ఆకుటోబరు పర్యంతము చలిజ్వరాలు తగులు చున్నది; నీవు త్వరగా జబ్బలపూరు చేరవలసిన దని చెప్పినాడు. ఈ దేశస్థులున్ను ఆ మాట నిజమే నని ఒప్పుకొన్నారు.