పుట:Kasiyatracharitr020670mbp.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బుద్ధోజీ రాజ్యతంత్రము చేయగా బహు ప్రబలమయిన దశను పొంది ప్రసిద్దికెక్కినాడు. ఈ బుద్ధోజీ తండ్రి యయిన రఘోజీ అనే అతనికి మరి కొందరు కొడుకు లుండగా వారికి రాజ్యము పంచిపెట్టినాడు. బుద్ధోజీ నాగపూరిని రాజధాని చేసుకొన్నాడు. మరియొక కొడుకు చందా అనే వూరిని రాజధాని చేసుకొన్నాడు. ఇద్దవు రత్నపూరును, నంది గ్రామమునున్ను రాజధానులుగా చేసుకొని రాజ్యము చేయుచువచ్చిరి.

బుద్ధోజీ దినములు మొదలుగా యింగిలీషువారు విహీత రీతిగా ఈరాజ్యములొ ప్రవేశించి అతని కొడుకులయిన రఘోజీ వగైరాలతో యుద్ధ ప్రసక్తి కలగ చేసుకొని కాలు నిలగడ చేసుకొన్నారు. పిమ్మట రాజ వంశస్థులు ప్రత్యేకముగా రాజధానులు కలగ చేసుకొన్న వారిలో కొందరు లయ మయిరి. మిగిలి యున్నవారు ఒకరిని ఒకరు విశ్వాసఘాత చేసి చంపుకొన్నందువల్ల రాజ్యమంతా యేక ముఖమయి తుదను అప్పాసాహెబు అనేవాని అధీనమయినది. అతడు యిక్కడ చేరియున్న యింగిలీషువారిని వెళ్ళకొట్టవలె నని యత్నము చేసినందున దేశ భ్రష్టుడై యిప్పట్లో మృతజీవిగా నున్నాడు. ఇప్పుడు యింగిలీషువారు రఘోజీ దౌహితృనికి పట్టము కట్టే వయసు వచ్చేదాకా రాజ్యతంత్రము తామే విచారింపుచువచ్చి కొన్ని ఖరారుమదారుల మీద విడిచి పెట్టినారు. ఆ చిన్నవానికి రఘోజీ అని పేరు పెట్టినారు. ఆఖరారుల ప్రకారము సం. 1 కి తొమ్మిది లక్షల రూపాయీలు కుంఫిణీవారికి కట్టవలచినది. వీరి రాజ్యము గత కాలములో తూర్పున కటకము వరకున్ను, దక్షిణమున నరదానది వరకున్నూ పడమట పునా వరకున్ను, ఉత్తరమున జభ్భలపూరు దాకానున్ను ఉండినది. రఘోజీ దినములు మొదలుగా కలహ పడ్డప్పుప్పుదంతా కొంచెము కొంచెముగా తూర్పు దేశోత్తరములను కుంఫిణీవారు ఆక్రమించినారు. అప్పట్లో నాగపూరికి ఉత్తరమున 13 కోసులమీద కొంఫిణీవారు అధికారము గాని నాగపూరు రాజుకు నిమిత్తములేదు. రామటెంకితో నాగపూరువారి రాజ్యపు సరిహద్దు ముగిసియున్నది.