పుట:Kasiyatracharitr020670mbp.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నది గాని, *[1]కాలీజి సిద్ధాంతి వ్రాసినట్టు యింతకు మునుపే సింహరాశిగతుడైనట్టు వ్రాయలేదు. తూర్పు దేశము నుంచి క్షామాదులకు లేచివచ్చి యిక్కడ నిలకడగా నిలచిన వారెవరయినా గ్రామాదులలో నుంటే వారు మాత్రము తెనుగు మటలాడుచున్నారు. తూర్పు దేశపు బ్రాంహ్మణులు, కోంట్లు మాత్రమీ దేశానికి యిదివరకు యొగ పాకి వచ్చుచున్నారు. నేను బ్రాంహ్మణనింటిలో యీ రాత్రి వసించి, యింగిలీషువారు యిక్కడనున్ను ముందు మజిలీలో నున్ను కట్టించి యుండే ముసాఫరుఖానాలో నా సవారీలు మూడు న్నుంచినాను.

10 తేది 4 ఘంటలకు లేచి యిక్కడికి 8 కోసుల దూరములో నుండే నాగిరి అనే యూరు చేరినాను. దారిలో నదరహి దోనెలవంటి దోనెలతో నొక నది దాటవలసినది. చికనీ అనే యూరివరకు దారి వల్లెడిగా నల్ల రేగడ భూమిగా నున్నది. ముందు గడిచిన దినముల దోవ వలెనే కాలు దిగబడే అడుసుకలది కాదు. ఆ గ్రామము మొదలుగా భూమి నల్ల రేగడయయినా గట్టిపరగనుక అడుసు త్వరగా నెండిపోవుచున్నది. విస్తరించి వాగులు యెక్కుడు దిగుడుగా దాటవలసి వున్నది. ఈ నాగరి అనే గ్రామము బస్తీ అయినది. రుక్మి విఠోబా దేవాలయము కొంచము విస్తారమయిన ముఖమంటముతో కూడా నున్నది. భ్ర్రాంహ్మణ యిండ్లున్నవి. ముసాఫరుఖానా కలదు. నేను దేవాలయములో దిగినాను. ముసాఫరులకు కావలసిన పదార్ధాలు దొరుకును. యేదులాబాదు మొదలుగా నిది వరకు మెరక పంటభూమి; పుంజధాన్యము చేనులు చేసి పయిరు చేయుచున్నారు. భాటకు నిరుపక్కల చేనులలో పశువులు చొరపడకుండా ముండ్లకంపలు తెచ్చి వెలుగు వేసుటవల్ల యీ ప్రయాస నిఛ్ఛే అడుసుతో కూడా ముండ్లుకలిసి యంచున్నవి. ఆ గ్రామములో ఆరాత్రి వసించినాను.

  1. *మద్రాసు ఫోర్టుసెంటు జార్జికోటలో సివిలు సర్వీసు ఉద్యోగులకు దేశభాషలు వ్యవహారములు నేర్పడం కోసం 1812 లో నొక కాలేజి స్థాపింప బడినది.