పుట:Kasiyatracharitr020670mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుండా కురిసినందున చెరువులు కాలువలు పుష్కలముగా నిండినవి. ఆ వర్షాకాలములో నేను ఈ గ్రామాలలో తగిలి నట్టయితే మిక్కిలి ప్రయాస పడుదును. అటుగాకుండా శ్రీరాముల దేమో నన్ను కొన్ని కారణాలచేత హయిదరాబాదు షహరులో నిలిపినదీన్నికాక, షహరు విడిచి ప్రయాణమైన వనుక కూడా, ప్రతిదినమున్నూ నేను మజిలీచేరి భోజనము చేసిన వెనక సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు వర్షము కురిసి వెలిసేటట్టు కటాక్షింపుచు వచ్చెను.

హయిదరాబాదు వదిలింది మొదలు ఈగోదారి తీరము వరకు నడమనుండే జమీను దారులు, జాగీరుదారులు పరగణాదారులు, షహరుకు ఆపక్కనిండెవారిపాటి బలాడ్యులున్ను కలహప్రియులున్ను కారు. యధోచితముగా రహితు జమాబందిమీద రూకలు వసూలు చేసే జ్ఞాపకము యీప్రదేశపు వారికి ఉన్నది గాని, షహరుకు అవతలితట్టు వారివలె ఊరూరికి కోటలు, కొత్తళాలు, బలముచేసి గ్రామాదులను పాడుచేయడములేదు. కృష్ణదాటినది మొదలుగా ఈగోదావరీతీరమువరకు యిక్కడివారు వాడే కోసు, మన 14 గడియ దూర మవుచున్నది. యిది హల్కాకోసు అనుచున్నారు. కృష్ణకు అవతలిగట్టు పర్యంతము వాడే కోసు, మన రెండుగడియల దూర మవుచున్నది. యిక్కడి కోసు 2 మయిళ్ళుకు కొంచము తక్కువనే చెప్పవచ్చును. నేను మనకోసుల ఉమారే చూచి వ్రాయుచు వచ్చుచున్నాను. మనగడియ దూరం 24 నిమిషాలకు నడవ వచ్చును. గనుక ఆ నిజామున ఊహించి, ఆ యూ యూరికిగల దూరమును నిర్ణయించి వ్రాయుచు వచ్చుచున్నాను. ఇక నున్నూ అట్లాగే వ్రాయడ మవుచున్నదని తెలియవలసినది.

ఈ గోదావరీ తీరమువరకు ఆ యా మజలీ గ్రామములలో తమలపాకులు దొరుకుచు వచ్చినా మంచివిగా నుండవు. గనుక దిగిన మజిలీ గ్రామాదులలో తమలపాకు లున్నచోటు విచారించి తోటలవృద్దికి మన సంతమనుష్యులను పంపించి లేతవిగా గిల్లించి సంగ్రహించు కొనుచు వచ్చినట్లయితే అనుకూలముగా నుంచున్నది. హయిదరాబాదులో గొప్పవారందరున్ను పండుటాకులు వేసుకొనుచున్నారు.