పుట:Kasiyatracharitr020670mbp.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాత్రము కట్టించి యుంచుతారు. ఆ మల్లుపేటలో ఒక పాడుకోట యున్నది. చెరువు జలసమృద్ధి గలది. ఆ గ్రామములో రాత్రి వసించినాను.

23 తేది ఉదయాన 7 ఘంటలకు బయలువెళ్ళి 11 ఘంటలకు 5 కోసుల దూరములోనుండే యీదలవాయి అనే రామస్థలము చేరినాను. ఆ యూరు చీలి జమీందారునితో చేరినది. గుడి చక్కగా కట్టి యుండక పోయినా దక్షిణదేశపు మర్యాద ప్రకారము ఆ జమీను దారుడు గుడిలో సకల రాజోపచారములతో ఆరాధన నడిపింపు చున్నాడు. గుడిచుట్టు 30 ఇండ్లుగల బ్రాంహ్మణుల యగ్రహారమున్నది. ఈతురకల రాజ్యమందు ఈస్థలము కుంపటిలో దామర మొలచి నట్టున్నది. తిరుపతి వదిలిన వెనక రాజోపచారములతో ఆరాధన నెడిచే గుడి యిది యొకటే చూచినాను. నా విచారణలోనున్ను వేరేలేదని తెలిసినది. ఈయూరు యధోచితముగా బస్తీగానే యున్నది. కావలసిన సామానులు దొరుకును. ఇక్కడి గుడిలో ప్రతిఫలించి యున్న పరమాత్ముడు ఈ జమీనుదారుని వంశస్థులకు పిలిచితేప లుకు ననేనాటి యనుగ్రహముతో ఆరాధనలు గైకొనుచున్నాడు. మల్లుపేట వదిలిన వనక కోసెడు దూరానికి ఇవతల యీదలగండి అనే దట్టమయిన అడివి యున్నది. రెండు కొంచపాటి తిప్పల నడమ భాట పోవుచున్నది. భాట బహురాతిగొట్టు, నల్లరేగడ భూమి. బహుచోర భయము గలది. మిక్కిలి భయంకరులయిన యింగిలీషు దొరలనే యీదలగండి భాటలో దోచినారు. నేను మల్లుపేట నుంచి ఆయుధసాణులను కొందరిని కూడా తీసుకొని నాతోకూడా వచ్చిన మనుష్యులను యుద్దసన్నద్దులుగా దిట్టము చేసుకొని గండి దాటి వచ్చినాను. దీనిపేరు యీదల్లఘాటు అని చెప్పుచున్నారు. నడమ వాగులు దాటవలెను. అదిన్నిగాక యీదలవాయి యూరినందు పర్షాకాలములో చెరువులో నుంచి మిక్కిలి వేగముగా పారుచునున్న బహులోతు గల రెండలుగు కాలువలు దాటవలెను. అక్కడ డేరామేకుల కంట్లము చెరువు మడుగు కాలువలు దాటేటప్పుడు కొట్టుకొని పోయినది. ఇట్టి భయ