పుట:Kasiyatracharitr020670mbp.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోయవు గనుక మోయను ఒక మనిషిని 6 రూపాయల జీతము నిష్కర్షము చేసి కొలువు పెట్టి నాలుగు డేరాల బొంగులు పదిన్ని సదరహి యిద్దరు కళాసులచేతనున్ను, సదరహి మనిషి చేతనున్ను మోయించుకొని వచ్చినాను. ఇంతేకాక హయిదరాబాదు నించి నాగపురికి పొయ్యేదారి బహు అడివిన్ని, మృగ భయమున్ను, చోరుల యుపద్రవమున్ను కలిగినది గనుక దారిబాగా తెలిసే కొరకు హయిదరాబాదు రెసై డెంటు వద్దనుండే పోష్టాఫీసు రయిటరు మేస్తరు ల్యూమ అనే పరంగి వాని మంచి తనము చేసుకొని ఒకరన్నర్సు అనే టప్పాల మనిషిని కూడా పిలుచుకొని అక్కడక్కడికి రన్నర్సు మనుష్యులు వారి వారిహద్దు వరకు నాతోకూడా వచ్చి దారి చూపించేటట్టు దిట్టము చేసుకొన్నాను. ఆ తపాలా రన్నర్సులను ఇక్కడ హరకాలని వాడుచున్నారు. వారిని కుంఫిణీ యిలాకా మనుష్యు లని ఆయా యూళ్ళలో గౌరవపరచు చున్నారు..తద్ద్వారా యీ యుపాయము నేను చెయ్యడము మిక్కిలి అనుకూల మయినది గనుక ఆ రన్నర్సుకు 1 రూపాయి దనుక ఇచ్చుచు పుసలాయించి ఒక మజిలీ నుంచి మరియొక మజిలీకి పిలుచుకొని వచ్చినాను. ఆకృష్ణ దాటినది మొదలు ఆ దేశములో కాకులు విశేషముగా లేవు. ముఖ్యముగా హయిదరాబాదు షహరులో ఒకటియైనా కనుపడినది కాదు. డెగలు పెంచేవారు విస్తరించి యున్నందున షహరులో వుండే కొన్నిటినిన్ని బ్రతకనియ్యరని తోచుచున్నది. ఆ రాత్రి అక్కడే నిలిచినాను.

21 తేదీ ఉదయాన 3 ఘంటలకు బయలుదేరి 2 కోసుల దూరములో నుండే మాషాపేట అనే యూరు 12 ఘంటలకు చేరినాను. దోవ నిన్నటి దోవవలెనే రమణియ్యముగ నున్నది. ఇరు పక్కలా జీడిచెట్లు, టేకుచెట్లు, మోదగచెట్లు, మొదలయిన వృక్షములు గల యడివి భూమి; సమ మయినది. ఆ మాషాపేట గొప్పయూరు. పేటస్థలము, సకలపదార్ధాలు దొరుకును. అక్కడ ఆరాత్రి నిలిచినాను. ఆయూరు వర్షాకాలములో మిక్కిలి బురద కలిగి చిత్తడిగా నుంచున్నది. హయిదరాబాదు వద్ద హుశేనుసాగర మనే చెరువు మొక