Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు గురువుగారు దగ్గఱ నుండి జరిపించడము కాశీలో ఆచారము గనుక ఇక్కడ కూడా ఆలాటి సందర్భాలు గురువుగారు చేయించేవారు. దీనివల్ల శిష్యుల సభాకంపము పోయి గండ్రతనం కలుగుతుందని గురువుగారు సెలవిచ్చేవారు. ఇక నొకటి : ఈ గణేశ్వరుని పూజించడముకు విద్యార్థులలో బ్రహ్మచారిని గురువుగారు నియమించేవారు. ఒకయేడు పూజించిన విద్యార్థి మఱియొక యేటికి పనికిరాడు. కారణమేమంటే : ఆ విద్యార్థి మఱుచటి యేటికి ఈ పూజాకారణంవల్ల గృహస్థయి తీరుతాడు. గృహస్టుకు బ్రహ్మచారియైన గణపతిని పూజించుటకు అర్హతలేదని గురువుగారు చెప్పేవారు.

కాశీ వెళ్లడానికి వూహ

ఈ రీతిగా గురువుగారివద్ద కడియెద్దలో చదువుకొంటూ వుండగా నాకు కాశీ వెళ్లడానికి వూహ కలిగింది. చక్కగా అన్నము పెట్టి చదువు చెప్పుతూ వున్న గురువును వదలి కాశీ వెళ్లడమెందుకని చదువరులకు శంక కలుగవచ్చును. కారణం వ్రాస్తూ వున్నాను. తఱుచు గురువుగారు కాశీవిశేషాలు ముచ్చటిస్తూ వుండేవారు. అవి విని విని వుండడమువల్ల, ఆయా విశేషాలు చూదామని అభిలాషయొకటి. ఇంకొకటి, నా చిన్నతనము సుమారు పదియేండ్ల వఱకు జన్మస్థానమైన కడియంలో వెళ్లినప్పటికి, తరువాత యానాములో వుండుట తటస్థించింది. కడియము పల్లెటూరు, యానామో, పట్నవాసము. అందుచేత కొంచెము నాగరకతకు సంబంధించిన అభ్యాసములకు అలవాటు పడ్డాను. ఆ అభ్యాసంలో ప్రతిరోజున్నూ తమల