Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీలు తటస్థమయినాయి. వెంటనే గిర్రున మళ్లి యింటికి వచ్చి, గంగా సంతర్పణ జరిగించుకొని, పెండ్లి అయిన కొద్ది రోజులలోనే కాశీ వెళ్లడంచేత తరువాయిగా వున్న మనుగుడుపు నిమిత్తం అత్తవారింటికి వెళ్లి, అక్కడినుంచి తిరిగి గురువుగారి వద్దకు వెళ్లి వారి వద్దనే వ్యాకరణం తరువాయి తిరుపతిశాస్త్రితో సహాధ్యాయిత్వమును గైకొని చదివితిని. ఇదివఱకు తిరుపతిశాస్త్రి నాతో విశేషమైత్రిగా వుండకున్నను. కాశీ వెళ్లి వచ్చినది మొదలు అవధానాది కారణములచే నాపేరు కొంత పైకి రావడం మొదలుపెట్టడం చేత, విశేషమైత్రిగా వుండ మొదలిడినాడు. కాని మధ్య మధ్య పోట్లాటకూడా ఆడుతుండేవాడు. అంతటో మా తల్లిదండ్రులు త్రోవ ఖర్చులకోసం అప్పుచేసి పంపించిన ముఫ్పె రూపాయలు తీర్చుకోవలసి నేనెక్కడికో సంపాదనకు బయలుదేరబోవుచుండగా, గురువుగారు, "అబ్బాయీ, నీకు యితడుకూడా వుంటే చాలా శోభగా వుంటుంది, గనుక ఇతన్ని కూడా తీసుకు వెళ్లవలసింది," అన్నారు. వారు ఈలా సెలవిచ్చేటప్పటికి, నాకూ తిరుపతిశాస్త్రికీ యేవో మనః కలహాలున్నాయి." దానిమీద నేను "ఆతడు వస్తే నా అభ్యంతరం లేదన్నాను. "రాకేం చేస్తాడు తప్పకుండా వస్తాడని గురువుగారని, “ఏమయ్యా, అతడూ నువ్వూ కలిస్తే బాగావుంటుందన్నారు. మంచిదన్నాడు, వచ్చాడు. కాకినాడ వెళ్లేము. అక్కడ జరిగిన శతావధానం" వగయిరా జాతకచర్యలో వున్న విషయమేకదా!