Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎక్కువగా చేదామని నా సంకల్పము, ఎక్కువంటే మరేమీలేదు గాని, పిండివంట మిఠాయి చేయించాలని నా కుతూహలం." యానాములో విస్తరించి విస్తళ్లు లేవుగాని, సమీప గ్రామము వింజరం వుంది గనుక నూరింటికి తక్కువ గాకుండా బ్రాహ్మణ్యము వస్తారు. ఇంకా బంధువులు వగయిరాలతో రెండు వందలకు యత్నం చేయాలి. ఇది సంపన్నులకయితే లెక్కలోది కాదుగాని అప్పుచేసి త్రోవ ఖర్చులకు మనియార్డరు చేసిన మా తల్లిదండ్రులు భరించగలరా? కాబట్టి నేను సంపాదించాలి, నాకు మాత్రం యెవరిస్తారు? నాకివ్వరు కాని, కవిత్వానికిస్తారు. ఇంకా ఇప్పటిలాగు అప్పటికి కవిత్వమంటే ఈసడింపు కలుగలేదు అని నా తలంపు. రుద్రాక్షతావళం, దర్భాసనం, గంగాయమునాచెంబు. విభూతి పెండికట్లు, నీరుకావి ధోవతులు, నేనూ కోనసీమకు ప్రయాణమయినాము. అప్పటికి నేనే విద్యార్థిని, కాబట్టి నాకు ఒక్క విద్యార్టీ అలంకారంగా లేడు. పండితవేషానికిది మాత్రమే లోటుగాని తక్కిన లక్షణాల్లో లోపము లేశమున్నూ లేదు. మురమళ్ల పోలవరమూ, క్రొత్తపల్లె, కేశనకులు, ఈ గ్రామాల్లో కొంత ప్రచారం చేశానుగాని, యేదో పది అయిదూ తప్ప త్రోవ పడలేదు. ఆపైని వృద్ధ గౌతమి (గోదావరి పాయ) దాటి ముమ్మిడివరం ప్రవేశించాను. త్రోవలో ఊరువెలుపల కొబ్బరితోటల్లో కొందరు గృహస్థులు కాపురమున్నారు. అందులో పండిత సంప్రదాయమున్నూ కవి సంప్రదాయమున్నూస్వతః పండితులునూ అయిన వక్కలంక వీరభద్రయ్యగారు నన్ను బహూకరించి అక్కడ వున్నంతకాలమూ మిక్కిలి ఆదరముతో ఆతిథ్యమిచ్చినారు. గ్రామకరణం కామరాజుగారు బహు పలుకుబడి