ఇట్టి సత్రభోజనాల మీద మళ్లా జిహ్వచచ్చి ఎట్లో తుని చేరినాము. అక్కడ మాకు చుట్టాలు లేరుగాని చుట్టాలవంటి వారున్నారు. వారింటికి వెడితే ఈలోపున చచ్చినజిహ్వ లేచి మళ్లా మనుష్యలోకంలో చేరదగిన భోజనం దొరికింది. ఇటీవల నెన్నెన్ని రాజయోగపు విందులనుభవించిననూ నాటి వంకాయ కూరలో శతాంశమునకు కూడ పోలవని సిగ్గువిడిచి వ్రాస్తున్నందుకు చదువరులు మన్నించాలి. ఇంకొకటి. వంట యొక్క రుచి కేవలం వండేవారియందే వుండదు, పదార్ధమందున్నూ వుండదు, తినేవాడి అవస్థనుబట్టి కూడా వుంటుంది.
సరే, తునినుండి కొన్ని మజిలీల మీద పిఠాపురం వచ్చి అక్కడ సత్రంలో సహపంక్తి చేసి కావిళ్లు భుజానపెట్టి చామర్ల కోటదాకా వచ్చినతరువాత కోమటి ఆ కాలువ పడవెక్కి వెళ్లిపోయాడు. నేను కాకినాడద్వారా యానాముకు వెళ్లాను. యానాం ప్రవేశించకపూర్వం సమీప గ్రామం నీలపల్లె దేవాలయంలో కాశీకావిడి సహితం ఆగినాను. ఆగి యింటికి కబురు పంపిన మీదట మావాళ్లు బాజాబజంత్రీలతో వచ్చి నన్ను ఇంటికి తీసుకుని వెళ్లారు." అప్పటికింకా కాశీనుండి గంగకావిడి తెచ్చిన వాళ్లకీ మర్యాదలున్నాయి.
గంగా సంతర్పణ వృత్తాంతము
ఇక్కడితో కాశీయాత్ర సమాప్తి అయినప్పటికీ దీనికే సంబంధించిన గంగా సంతర్పణ వృత్తాంతం వ్రాయడం అంత అనుచితం కాదనుకుంటాను. గంగా సంతర్పణ కొంత నా తాహతుకు