పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాదు, తిని చూచాను. మీరీ రోజులలో సత్రభోజనాని కెందు కెళ్లారని శంకింతురేమో. బొబ్బిలి పట్టాభిషేకం కృతియిచ్చి వచ్చేటప్పుడు" ఇదివఱలో నావద్ద చదివిన విద్యార్థులు కొందఱి కోరిక మీద విజయనగరంలో ఆగవలసి వచ్చింది. ఆ విద్యార్థులు నాక్రోసమేదో పెద్ద ప్రయత్నం చేయబోతే, “అబ్బాయీ! మీరంతా యెక్కడ భోంచేస్తే అక్కడే భోంచేస్తాను. ఒకపూట కేమిటి, మీ విద్యార్థుల పంక్తిని భోంచేయడం నాకు పరమసంతోషం" అన్నాను. దానిమీద ఆ సత్రాధికారితో చెప్పి యేదో సదుపాయం కల్పించాలని అనుకున్నారు కాని, నేను దానికీ అంగీకరించక, నాపేరు చెప్పనేవద్దు. నేను వచ్చినట్టు విజయనగరంలో యెవ్వరికిన్నీ తెలియనే కూడదు, అలాగైతేనే నేను వస్తాను, లేకుంటే రానేరాను, అని ఖండితంగా చెప్పేటప్పటికి, విధిలేక వాళ్లు అందుకే అంగీకరించారు. ఆ కారణంచేత ఆ విద్యార్థుల సత్ర భోజనం నాకు అనుభవానికి వచ్చింది. ద్రవ్యదాతల లోపముందేమో అంటే, రోజు వకంటికి పన్నెండు రూపాయలు కూరలకే యిస్తారట. ಇట్టి స్థితిలో పైని వర్ణించిన రీతిగా భోజనం వుండటానికి కారణం మధ్యవాళ్ల చౌర్యమే కాక మఱేమి? ఇంకొక్క విశేషం. ఈ సత్రాధికారి ఎవరో సామాన్యుడు కాక వేదం వచ్చిన కుటుంబంలో పుట్టి వేదం చెప్పికొన్న శ్రోత్రియుడని కూడా విన్నాను. అందుకే కాబోలును, ఇంత శ్రోత్రియంగా విద్యార్థుల భోజనం వుందనుకోవలసి వచ్చింది.