పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్గం అతిక్రమిస్తూ, త్రోవలో కొంచెం కొంచెం రోడ్డుకు దూరంగా వున్నప్పటికీ శ్రీకూర్మం, సింహాచలం, వుప్పమాక, మొదలైన క్షేత్రాలు సేవించుకుంటూ ఎట్లాగయితేనేమి తుని చేరాము. గంజాం వచ్చినది మొదలు స్వయంగా వండుకోవడం తప్పిందని యిదివఱకే వ్రాశాను. త్రోవలో చాలవఱకు సత్రాలన్నీ శ్రీ మహారాజులుం గారివే." ఆ సత్రాలు సదుపాయంగా అన్నోదకా లివ్వడానికే అసలు ద్రవ్యదాత లేర్పరచి వున్నారట. కాని యిటీవల ఆ సంస్థానానికి దివాన్గిరీ చేసిన శ్రీ పెనుమత్స జగన్నాథ రాజుగారు వక్క సత్రం తాలూకు సొమ్ముతో రెండేసి సత్రాలు పెట్టి ఆ సదుపాయం పూర్తిగా తగ్గించారని మా గురువుగారు చెప్పగా విన్నాను. నాకు ఈ ప్రయాణంలో గురువుగారు చెప్పినమాట అనుభవంలోకి వచ్చింది." దివాన్ జీ జగన్నాథరాజు గారు కూడా మహాయోగ్యుడే కాని, వారి వుద్దేశ్యం, ఏదో ఆపూట తిని వెళ్లేవాళ్లకి సదుపాయ మెందుకు? అసలు లేకపోవడం కంటే, ఇంత చారునీళ్లు అన్నం వుంటే చాలదా, అనియట. మంచి యోగ్యులకు తోచే వూహలు కూడా వకప్పుడు లోకాపకారకా లవుతాయి అన్నందులకీ సత్రాలే వుదాహరణం. దివాన్జీగారు వకటి రెండుచేస్తే, దానిలో గుమాస్తాలూ, వంటబ్రాహ్మలూ మరికొంత తగ్గిస్తే, తుదకు నీళ్లలో వుప్ప మాత్రం వేసి తీసిన తోటకూర, సుద్ద కల్పిన నీళ్లవంటి మజ్జిగ - ఈ రీతిగా భోజనం ఏర్పాటవుతుందని వేఱే వ్రాయనక్కఱలేదు. ఈ భోజనం అప్పుడే చూచాను, మళ్లా ఈ మధ్య నాలుగేండ్లనాడు (1931లో) విజయనగరం విద్యార్థులు భోంచేసే సత్రంలో చూచాను. చూడడమంటే చూడడం