మాసంలో శీతాఫలం దొరకడం అత్యద్భుతంగా కనపడి ఈ చపలత్వానికి నన్ను పురికొల్పింది. రాత్రికి జ్వరం ప్రారంభించింది. ఆ సత్రంలో రెండు లంఘనాలు చేసి మూడోరోజున పథ్యం పుచ్చుకొన్నాను. ఆ సత్రం అడవిలో వుంది. గోవిందపురం అక్కడికి రెండు మైళ్లలో వుందట. ఆ సత్రం పెట్టించిన పుణ్య పురుషుడు సమయానికి అక్కడనే వుండడంచేత నా అనారోగ్యం ఆయనకు తెలిసింది. అనారోగ్యంలో నున్ననూ ఏవో కొన్ని శ్లోకాలు నావల్ల ఆయన వినడంవల్ల నాయందపారమైన భక్తికలిగి అక్కడ నున్న రోజులలో నాకు ఆయన చేయించిన సదుపాయము వర్ణనాతీతము. ఒక నెలరోజులైనా అధమం అక్కడ వుండి మంచి ఆరోగ్యమును పొందినపిమ్మట వెళ్లవలసినదని ఆయన మిక్కిలిగా నిర్బంధించాడు. కాని కోమటికి క్షణమొక యుగంగా వుంది. క్రొత్తగా కాపురమునకు వచ్చిన భార్యను వదలి వచ్చిన వాడతడు. నేను క్రొత్తగా వివాహమైన వాడనే అయినను, బ్రహ్మచారివంటివాడనే. కోమటి నాతో పాటెట్లుండగలడు?
ఒక్కొక్కరి హస్తవిశేషం!
ప్రయాణం కావడానికి మొదలుపెట్టాడు. నాకాతని సాయం వదలడం ఇష్టం లేదు. ఎట్లో మూడోరోజన పథ్యము పుచ్చుకొని బండి కుదుర్చుకొని బయలుదేరాము. ఆ రాత్రికి - పై మకాము పేరు మఱచినాను. అక్కడ కూడా సత్రం వుంది. ఆ సత్రానికి వెళ్లాలి. చులాగ్గా వెళ్లవలసిందే కాని, బండివాడు నిద్దరోతూంటే యెడ్లు వాటికిష్టం వచ్చిన రోడ్డు మార్గం పట్టాయి. మాకేం తెలు