లేదు. ఆ కారణంచేత వున్న యథార్థం చెప్పవలసి వచ్చింది. “సొమ్ము అంతో యింతో వుంది, ముందే జాగ్రత్తపడడం మంచిదని ఆలా అన్నాను, కనుక వెడదాం పదండి" అన్నాడు. సరేనని బయలుదేరాము.
కాశీ కావడి మోత
అయితే మేమిద్దరమున్నూ కాశీకావళ్లు పూర్వులతో పాటు కట్టించుకొన్నామే గాని, యిదివఱకు వక మకామైనా మోయలేదు. ఇక్కడనుండి మోయడానికి మొదలెడ దామని బుద్ధి పట్టింది. భుజాలమీద కావిళ్లు పెట్టుకొని బయలుదేరాము. గోవిందపురం సత్రానికి రాత్రిపూటకు వెళ్లాలి. అయిదు కోసుల మకాము. రోడ్డు మార్గము. ఒకటి రెండు కోసులు నడిచేటప్పటికి నా భుజము సహించింది కాదు. కోమటి చిన్నప్పటి నుండి వ్యవసాయంలో నలిగినవాడు. అంతేకాక లావుపాటి వెదురుబొంగు అతడు కట్టించుకొన్నాడు. అదేమో బలువుగా వుంటుందనుకొని నా తాహతుకు సరిపోయే సన్నపు వెదురు నేను కట్టించుకొన్నాను. కోమటంత కాకపోయినా విద్యార్థి దశలో నేనున్నూ కొంచెం నీళ్ల కావిళ్లకు అలవాటైనవాడనే అయినప్పటికీ, ఈ సన్నము నన్ను బాధించడానికి మొదలు పెట్టింది. ఆ రహస్యము అప్పుడు కోమటి నాకు చెప్పి, నా కావిడి అతడెత్తికొని ఆతడి కావిడి నాకిచ్చాడు. ఎట్లో ఆ మకాం సూర్యాస్తమయానికి చేరుకున్నాము. కాని, త్రోవలో శీతాఫలప్పళ్లున్నూ జీడిపప్పున్నూ తిని ఒక సెలయేటిలో నీళ్లు త్రాగినాము. కాలంగాని కాలంలో ఆషాఢ