పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలివితక్కువవాడెవడు?

“బ్రతుకుజీవుడా’ అని కొంత సంతోషంతో అయిదు నిమిషములకన్న తక్కువ కాలమే నేనక్కడ కూర్చున్నాను. పూర్తిగా సంతోషమేల కలుగలేదని చదువరులు శంకింతురేమో. వాడు నన్ను చంపే వుద్దేశ్యంలో లేడని స్పష్టపడుటచే కొంత సంతోషమున కవకాశం కనపడుతూనే వుందికదా. ఇక కొంత విచారమెందుకంటే తిరిగివచ్చి తీసుకుపోయి దేవీ నవరాత్రులదాకా వాళ్ల టోళాలలో దాచి, అమ్మవారికి బలి వేస్తాడేమో అని కొంతవిచారం. ఏం వ్రాయను? అప్పుడు నా మనస్సులో నెన్ని రసాలకేనా అవకాశం కలిగింది. అంతా ఎంతసేపు, అయిదు నిమిషాలలోపు మళ్లా నాకు ఏం తోచిందో, తరువాయి మెట్లు ఎక్కి మేడమీదికి వెళ్లాను. నాలుగు దిక్కులు చూచాను. బాబూ లేదు, గీబూ లేదు. ఏమోగాని, వక్క నవుకరు కూడా లేడు. మేడమీద కూడా ఒక వీధిలాగున్నది. కొంతవఱకు వెళ్లాను. మళ్లా ఇదివఱలో మేమెక్కిన మోస్తరువే మెటూ, త్రోవా, వకటి కనుపించింది. అక్కడికి వెళ్లేటప్పటికి ఆ మెట్లు ఏమాత్రమో తరువాయిలో ఆ మోసగాడు కనిపించాడు. పోనీ పోతున్నాడు, అనుకొన్నాను, మళ్లా వెనక్కి చూశాడు నేను కనుపడ్డాను. “బాబు లేడు, ఎక్కడికో వెళ్లాడు, నీ సొమ్ము ఇదిగో తీసికో" అని వెనక్కి వచ్చి నాచేతికిచ్చేశాడు. ఏమిటో ఈ చిత్రము! సొమ్మెందు కియ్యాలి! ఇయ్యకపోతే నేనేం చేస్తాను? తాను మోసగాడు కాడని నే ననుకోవడాని కనుకొందునా? ఇట్లు నన్ను నమ్మించడం వల్ల వానికి కలిగే లాభమేమిటి? నా దగ్గఱ నున్న సొమ్మింతేకదా! అది యిది వఱకే ఇచ్చితినే! ఏమో నాకప్పుడే