పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రోజున నాకు ఒక ఔన్సు రమారమీ ఈ భంగును బలవంతంగా తాగించినారు. దానిమీద నాకు మత్తు అపారంగా యొక్కినది. ప్రాణాపాయం కలుగుతుందేమో అన్నంతదాకా వచ్చి తుదకు కొన్ని విరుగుళ్లు ఇవ్వడంవల్ల కొన్ని గంటలకు తిక్క దిగింది కాని, ఈ విరుగుళ్ల వల్ల శీతలించి గ్రహణిలోనికి దింపింది. నాకు ఇది పడదని ఆయా విద్యార్థులెఱుంగరేమో అంటే, పూర్తిగా యెఱుగుదురు. సుమారింతకు నెలరోజులనాడు కాశీలో వక "యజ్ఞోపవీతం" జరిగింది. యజ్ఞోపవీతమంటే జందెము వున్న పంచద్రావిడులు యావన్మందికిన్నీ కాశీలో నున్నవారికి నాకు ఒక రూపాయి దక్షిణతో పంచపక్వాన్నములతో సంతర్పణ చేయడము. దశవిధ బ్రాహ్మణులలో పంచద్రావిడులు, పంచ గౌడలు అని రెండు తెగలు. ఇందులో పంచద్రావిడులలో ఘూర్జరులు తప్ప తక్కిన నాలు తెగలకు, అనగా, ఆంధ్ర ద్రవిడ కర్ణాణ మరాటులకు, సర్వ సామాన్యంగా పంక్తిభోజనం కలదు, గౌడలకో “ఎవరికివారే యమునాతీరే” అంతేకాని, పంక్తిభోజనాచారము వారిలో వారికే లేదు. పైగా వారు మత్స్య భుక్కులు కూడాను. అందులో వారీ యజ్ఞోపవీతంలో చేరరు. సత్రభోజనమేనా పై జెప్పిన తెగలవారికేగాని గౌడలకు లేదు." స్వయంపాకము చేసికొంటూ చదువుకోవడమేగాని గౌడలు, వేటౌక సదుపాయం వారికెప్పుడున్నూ లేదు. ఆ యజ్ఞోపవీతంనాడు మా ఘట్టంలో విద్యార్థులు వారివారి తాహతు ననుసరించి సేరు సేరున్నరా రెండు సేర్లు ఈ రీతిని భంగు పట్టించి భోజనానికి బయలుదేరారు. పడదని యెంతచెప్పినా వినక ఏ కొంచెమో నాకుకూడా పోశారు. మేము