Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాపన చేస్తూ వున్నాను. బుడ్వామంగళ్ అనగా పడవల మీదనే మేళతాళాలతో జనులు వక వారంరోజులు వుండి గంగలో జరిపే వక వుత్సవం. అది యేటా వేసవిలో జరుగుతుంది. బహురమ్యంగా వుంటుంది. ఆయినా సంతోషములతో కాలం జరుపుతూ వుండగా మావాళ్లు త్రోవ ఖర్చులకు ముప్పది రూపాయలు పంపినారు. ఇంకా కొంత కాశిలో దొరకిన బాపతు నావద్ద నిల్వయున్నది. కాశీలో మహామహావాళ్లకే దిక్కులేదుగదా? అట్టి స్థితిలో విద్యార్థిగా వెళ్లిన నీకు ధన సంపాదన మెట్లు జరిగిందని శంక కలుగవచ్చును. నిజమే; కాశీలో సత్రాలలో భోజనం దొరకుటే లేనిచో, ముష్టి యెత్తుకుంటే ముష్టి కూడా దొరకదు. మాధుకర మంతకుముందే లేదు. పండితులకు యాత్రార్ధమై వచ్చిన గృహస్టులు సభలు చేసి యేమైనా సమ్మానించడం కలదు. కానీ అదిన్నీ చాలా అరుదే, యెట్లో యాత్ర చేసికొని స్వదేశానికి వెళ్లేవారేకాని పండితులకు సభలు చేసి సమ్మానం చేయదగు గృహసులు యొందలో వుండరుగదా? ఈ సభలు పెద్ద పండితులకు, బాగా పేరు మోగినవారికేగాని ఒక మోస్తరుగా వుండే పండితులకే తటస్థింపవు. అట్టి స్థితిలో విద్యార్థులకెక్కడ తటస్థించుతవి? ఇక విద్యార్థులకు తీర్ధవిధి బ్రాహ్మణార్థాలు తప్ప అంతో యింతో ధనార్జన కాదగ్గ వుపాయం లేదు. నాకు ఆ బ్రాహ్మణార్థాలు ఇతర విద్యార్ధులకంటె కొంచము ఎక్కువగా తగిలేవి. కారణమేమంటే, నేనక్కడ వున్న రోజుల్లోనే గోదావరి డి రామచంద్రపురం తాలూకా దంగేరు గ్రామ కాపురస్టులు వేదశాస్త్ర పండితులు వుప్పలూరి భీమన్న శాస్రులు గారి కుమాళ్లల్లో వకరు శంభుసోమయాజులు గారు కాశీలో వున్నారు.