Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశము వారే అయినను, కాశీలో చదివి మహావిద్వాంసులై అక్కడి పండితులతోపాటు పేరు ప్రతిష్టలు కలిగి, అక్కడనే సకుటుంబంగా నివసించేవారు. ఆయన పైకి పిచ్చివారుగా కనపడేవారు గాని, పూర్తిగా పిచ్చివారు మాత్రం కాదు. ఒక రోజున క్రొత్తవిద్యార్థులను విచారించేటప్పుడు కృష్ణశాస్త్రిగారింటి పేరు కందుకూరి వారు అని తెలిసేటప్పటికికందుకూరివారు వెల్నాటి బ్రాహ్మణులని ఆయన యెఱిగి యుండవలసినదే అయిననూ - "వీడు పాషండుడురోయి" అని మొదలు పెట్టినారు. తరువాత యెట్లో ఆయనను నమ్మించి ఆ చిక్కు వదల్చుకొన్నాము.

కాశీని తిట్టడానికి తగిన కాలం

నేను కాశీవెళ్లి యిప్పటికి సుమారు 44 సంవత్సరములు" దాటవచ్చింది. ఇటీవల కాశీలో అయి అన్నసత్రములలో కొన్ని కూడ లేవనియు, విద్యార్థులకు ఏవిధమైన ఆనుకూల్యము లేదనిన్నీ విని ఎంతో విచారము పొందితిని. బహుశః ఆయా సత్రములన్నియు ఆయా పుణ్యపురుషులచేత యేర్పరచబడడానికి కారణము, కాశీఖండంలో వ్యాసులవారు కాశీలో ఒకనాడు భిక్ష దొరకక కాశీని పట్టుకొని తిట్టిన ఘట్టమే అని నేననుకొంటాను. ఇప్పుడు మళ్లా ఆ వ్యాసులవారి వంటి వారెవరేనా కాశీని తిట్టవలసి వచ్చేయెడల, తగినకాలం వచ్చినట్లు తోస్తుంది. కాని ఆ వ్యాసులవారి వంటివారేరీ? ఆ కాలంలో వున్నంతమంది మహా పండితులు కూడా యిప్పుడు కాశీలో వున్నట్లు వినము. అబ్బో.! అప్పుడు గంగాధరశాస్రులుగారు, శివకుమార పండిజీవారు, కర్ణాట